
ప్రైవేట్ బస్సుల నుంచి భారీగా పన్ను ఆదాయం కోల్పోతున్న రాష్ట్రం ఆల్ ఇండియా పర్మిట్ ఫీజుల విధానంలో మార్పుల దిశగా అడుగులు ఒక్కో సీటుపై పన్నును రూ.
4,000 నుంచి 1,800కి తగ్గించేలా కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని ప్రతిరోజూ వందల ప్రైవేటు బస్సులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ వాహనపన్ను ఆదాయపరంగా రాష్ట్రానికి గణనీయమైన నష్టం వాటిల్లుతోంది. రాష్ట్రానికి ఏటా కేవలం రూ.7 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోంది. హైదరాబాద్ నుంచి సాధారణ రోజుల్లో సుమారు 700 పైచిలుకు.. వారాంతాలు, పండగలప్పుడు అంతకుమించి బస్సులు తిరుగుతుంటే, అందులో 114 బస్సులనే యజమానులు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రైవేటు బస్సుల్లో 85 శాతానికిపైగా ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయినవే ఉన్నాయి. ఐదొందల పైచిలుకు నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్వి ఉన్నాయి. గోవా, పాండిచ్చేరి వంటిచోట్ల కూడా రిజిస్ట్రేషన్ అయిన బస్సులున్నాయి. ఆల్ ఇండియా పర్మిట్లు తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు బస్సులు తిప్పుతున్నారు.
ప్రైవేటు బస్సులకు సంబంధించి ఆల్ ఇండియా పర్మిట్ ఫీజుల విధానంలో సంస్కరణలు తీసుకురావడంపై రాష్ట్ర రవాణాశాఖ దృష్టి సారించింది. కమిషనర్ ఇలంబర్తి తెలంగాణ సహా నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, పాండిచ్చేరి, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలోని పన్నుల విధానంపై అధ్యయనం చేస్తున్నారు. కమిషనర్‌తో పాటు నిజామాబాద్ డీటీసీ దుర్గాప్రమీల వివరాలను సమగ్రంగా విశ్లేషిస్తున్నారు.
కర్ణాటకలో ఒక బస్సు సీటుకు త్రైమాసిక పన్ను రూ.3,500 ఉండగా 2,500కు.. కేరళ రూ.4,000 నుంచి 1,800కి తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయ్యే బస్సులపై ఒక్కో సీటుపై ప్రస్తుతం ఉన్న త్రైమాసిక పన్నును రూ.4,000 నుంచి రూ.1,800కు తగ్గించే ప్రతిపాదనను రవాణాశాఖ పరిశీలిస్తోంది. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనల్ని పంపించనున్నట్లు సమాచారం.
తెలంగాణలో పన్ను రేట్లు తగ్గిస్తే నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందిన బస్సులు కూడా తెలంగాణకు మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బస్సుల రిజిస్ట్రేషన్లు తెలంగాణకు మారితే మరో కీలక ప్రయోజనం కూడా ఉంటుందని అంటున్నారు. కొత్త బస్సుల బాడీ నిర్మాణం, ఫిట్మెంట్ వంటి పనులు రాష్ట్రంలోనే జరిగే అవకాశం ఉండటంతో ఈ రంగానికి చెందిన పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.