
‘ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా.. బొమ్మరా.. ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా.. అమ్మరా..’ అంటూ ఓ పాటలో చెప్పినట్లు ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ బంగారు బొమ్మలానే అపురూపంగా చూసుకుంటాడు.
కష్టాలను, కన్నీళ్లనూ దిగమింగుకుని ప్రేమను పంచుతాడు.
నాన్నంటే బాధ్యత, భరోసా, భవిష్యత్తు..! ప్రతి తండ్రి తన కూతుర్ని ఓ బంగారు బొమ్మలానే అపురూపంగా చూసుకుంటాడు. కష్టాలను, కన్నీళ్లనూ దిగమింగుకుని ప్రేమను పంచుతాడు. అందుకే అమ్మాయిల జీవితంలో నాన్నే మొదటి హీరో. ఈ నేపథ్యంలో ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తమ నాన్నతో ఉన్న అనుబంధాన్ని పంచుకోమని ‘వసుంధర.నెట్’ ఇచ్చిన పిలుపుకి పాఠకుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. వాళ్లలో కొందరు తమ తండ్రి గురించి పంచుకున్న స్ఫూర్తిదాయక విశేషాలు ఇవీ!
ప్రతి అమ్మాయికీ తన తండ్రే మొదటి హీరో. అలా నా జీవితానికీ మా నాన్నే హీరో. మా నాన్న లారీ డ్రైవర్. చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోయి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. పైచదువులు చదివే అవకాశం నాన్నకు దక్కలేదు. కానీ, తన పిల్లలు మాత్రం మంచి విద్యను పొందాలని కలలు కన్నారు. ఆ కలను నిజం చేయడానికి ఎన్నో త్యాగాలు చేశారు. రేయి, పగలు తేడా లేకుండా.. ఎండా, వాన లెక్క చేయకుండా లారీ నడిపారు. సంపాదించిన ప్రతి రూపాయినీ మా చదువులకే ఖర్చు చేశారు. మా ముగ్గురినీ కార్పొరేట్ కళాశాలలో చదివించారు. మా సోదరుడితో సమానంగా పెంచారు. మా కోరికలను తీర్చడానికి తన ఇష్టాలను వదులుకున్నారు. ఈ క్రమంలో తన అలసట, బాధ, కష్టాలను ఎప్పుడూ బయటపెట్టలేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన ముఖంలో చిరాకును ఎప్పుడూ చూడలేదు. నేను ఈరోజు సాధించిన ప్రతి చిన్న విజయం వెనక మా నాన్న కష్టం ఉంది. అందుకే నా జీవితంలో ఆయన ఒక తండ్రి మాత్రమే కాదు.. అంతకుమించి! ఈ కథనం నా తండ్రికి మాత్రమే కాదు, తమ కుటుంబాల కోసం జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రతి తండ్రికీ అంకితం! - భానోతు దివ్య, యాదాద్రి భువనగిరి
నాన్నా.. నువ్వంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పటి ఆ స్మృతులు ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి. మమ్మల్ని స్కూల్‌కి తీసుకువెళ్లడం.. హార్మోనియంతో పాటలు నేర్పించడం.. సైకిల్ తొక్కించడం.. టీచర్‌గా చదువు చెప్పడం.. స్టేజి మీద డ్రామాలు వేయించడం.. పాటలు పాడించడం.. పరీక్షల సమయంలో మాతో పాటు నిద్రపోకుండా చదివించడం.. అన్నీ గుర్తొస్తున్నాయి..!
పెద్దయ్యాక కలిసి సినిమాలకి వెళ్లడం.. హిందీ సీరియల్స్ చూడటం.. నాతో పాటు సిటీ బస్సులో కాలేజీకి రావడం.. పరీక్షలప్పుడు ఎగ్జామ్ సెంటర్ దగ్గరే వేచి ఉండడం.. అన్నీ గుర్తొస్తున్నాయి..!
నా పెళ్లి అప్పగింతల తర్వాత నీ నుండి దూరంగా వెళ్తుంటే ఆ దుఃఖం.. అమెరికా వచ్చేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో నీకు దూరంగా వెళ్తుంటే ఆ బాధ.. అన్నీ గుర్తున్నాయి.
నువ్వు రాసిన కథలు, కవితలు.. గీసిన భక్తి రస చిత్రాలు, ప్రకృతి అందాలు.. మట్టితో చేసిన వేల శివలింగాలు.. పిల్లనగోవితో పాడే భక్తి పాటలు.. అన్నీ గుర్తొస్తున్నాయి..!
రిటైర్మెంట్ తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా మా కోసం, మా భవిష్యత్తు కోసం కష్టపడ్డావు. విలువలు నేర్పించావు. ఇప్పుడు చిత్రాలు గీస్తూ.. కథలు, కవితలు రాస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నావు. మా భవిష్యత్తు కోసం నీతో పాటు అమ్మ చేసిన కృషి, పడిన కష్టాలు.. అన్నీ గుర్తొస్తున్నాయి..!
ఒక్క మాటలో చెప్పాలంటే మా ముగ్గురి మూలం మీరు. అమ్మా, నువ్వూ.. మీ ఇద్దరూ మా ప్రాణం. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా..! - పావని, టెక్సాస్
నాన్నా.. ఎలా జీవించాలో మీ నుంచి నేర్చుకున్నా. అప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అరకొర సంపాదనతోనే మీరు కుటుంబాన్ని నడిపించిన తీరు మాకు ఆదర్శం. ‘ధనానికి మన కన్నా తక్కువ.. గుణానికి మన కన్నా ఎక్కువ ఉన్నవారితో పోల్చుకో’ అని మీరు చెప్పిన మంచిమాటతో జీవితంలో సంతోషంగా ఉండడం నేర్చుకున్నా. నా పిల్లలు ఒకరు ఇంజినీర్.. మరొకరు డాక్టర్ అయ్యారంటే అందుకు మీరు నేర్పిన క్రమశిక్షణే కారణం. మీరు ఎప్పటికీ నా హీరోనే. లవ్ యూ నాన్నా! - ఎన్. విజయలక్ష్మి, మంచిర్యాల
నేను ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మా నాన్న. నా కాళ్ల మీద నేను నిలబడి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానంటే దానికి కారణం నాన్నే. ‘అమ్మాయివి కాబట్టి ఇది చేయకూడదు.. అది చేయకూడదు’ అని ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. నాన్న తన వృత్తిని ఎంతగానో ప్రేమిస్తారు. అది నన్నెంతో ప్రభావితం చేసింది. పనిని కేవలం బాధ్యతగా కాకుండా, ఇష్టంగా చేయడం ఆయన దగ్గరే నేర్చుకున్నా. కుటుంబం కోసం ఆయన పడిన కష్టం, చేసిన త్యాగాలు, జీవితాన్ని ఎదుర్కొన్న విధానం నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమే! కష్టపడటం, కలలు కనడం నేర్పిన వ్యక్తి మాత్రమే కాదు, వాటిని సాకారం చేసుకునే దిశగా ధైర్యాన్నిచ్చిన వ్యక్తి కూడా నాన్నే. అందుకే ఆయన నాకు ఎప్పటికీ స్ఫూర్తిప్రదాతే! - శ్రుతి కిరణ్, విజయవాడ
మరిన్ని కామెంట్ల కోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి..
నాన్నతో మీ అనుబంధం.. మీ ఉన్నతిలో ఆయన పాత్ర.. నాన్నలో మీకు బాగా నచ్చిన అంశాలు.. పంచుకోండి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.