కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’తో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రుక్మిణి వసంత్ . తన సహజసిద్ధమైన నటనతో, పద్ధతైన పాత్రలతో తక్కువ కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు...
కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో’తో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రుక్మిణి వసంత్ . తన సహజసిద్ధమైన నటనతో, పద్ధతైన పాత్రలతో తక్కువ కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ సైబర్ నేరానికి బాధితురాలిగా మారారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ కొందరు కేటుగాళ్లు సృష్టించిన అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. అయితే, దీనిపై ఆమె గట్టిగా పోరాడి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ ధరించి ఫోటోషూట్ చేసినట్లు కొన్ని చిత్రాలు, విజువల్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. భారీ ప్రొడక్షన్ సెటప్, టెక్నీషియన్ల మధ్య ఈ షూట్ జరిగినట్లు కనిపించడంతో.. ఇన్నాళ్లూ హోమ్లీగా కనిపించిన నటి ఇలాంటి గ్లామర్ బాట పట్టిందేంటని నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే ఈ ప్రచారంపై రుక్మిణి వసంత్ తీవ్రంగా స్పందించారు. అవన్నీ ఏఐ టెక్నాలజీతో సృష్టించిన నకిలీ (డీప్‌ఫేక్) చిత్రాలని ఆమె స్పష్టం చేశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా స్పందిస్తూ.. "ఇలాంటి అశ్లీల కంటెంట్‌ను సృష్టించడం, షేర్ చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమైన చర్య. ఇది నా వ్యక్తిగత గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించడమే. ఈ మార్ఫింగ్ ఫోటోల వల్ల నా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని నేను వదిలిపెట్టను, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాను" అని హెచ్చరించారు. అలాగే ఆ ఫోటోలను ఎవరూ షేర్ చేయవద్దని నెటిజన్లను కోరారు. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు.. ముగ్గురు అరెస్ట్ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న రుక్మిణి వసంత్.. బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన బెంగళూరు పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ డీప్‌ఫేక్ చిత్రాల వెనుక ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో బాగోల్ కోట్ జిల్లా, చిలకముఖి గ్రామానికి చెందిన రవి కుమార్ (24), బెంగళూరుకు చెందిన చంద్రకాంత్ (33), అలాగే మహాలక్ష్మీ నగర్‌కు చెందిన రంజిత్ (25) ఉన్నారు. వీరి నుంచి సైబర్ పోలీసులు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. సెలబ్రిటీల శరీర భాగాలను జూమ్ చేసి ఫోటోలు తీసే పద్ధతిపై గతంలోనే గళమెత్తిన రుక్మిణి, ఇప్పుడు ఏఐ వేధింపులపై చట్టప్రకారం పోరాడి నిందితులకు బుద్ధి చెప్పారు. ఈ విషయాన్ని రుక్మిణి వసంత్ ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ పోలీసులు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్‌ని షేర్ చేశారు. రుక్మిణి వసంత్ కేవలం గ్లామర్ నటి మాత్రమే కాదు, నటనలో లోతైన శిక్షణ పొందిన ప్రతిభావంతురాలు. లండన్‌లోని ప్రఖ్యాత 'రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్' (RADA)లో ఆమె యాక్టింగ్ కోర్స్ పూర్తి చేశారు. అందుకే ఆమె చేసే ప్రతి పాత్రలోనూ ఎంతో సహజత్వం కనిపిస్తుంది. 2019లో వచ్చిన కన్నడ చిత్రం ‘బీర్బల్ ట్రయాలజీ’తో వెండితెరకు పరిచయమైనప్పటికీ.. 2023లో విడుదలైన ‘సప్త సాగరదాచే ఎల్లో’ (ప్రియ పాత్ర) ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ సరసన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో నేరుగా పరిచయమైన రుక్మిణి.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్, హీరోల ఛాయిస్‌గా మారారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’లో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. అలాగే కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న అంతర్జాతీయ స్థాయి చిత్రం ‘టాక్సిక్’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తక్కువ సమయంలోనే భాషా బేధం లేకుండా అగ్ర అవకాశాలు అందుకుంటున్న రుక్మిణి వసంత్.. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.