ఏపీపీఎస్సీ కానిస్టేబుల్ గోదావరిలో దూకేసిన ఘటన కలకలం రేపింది. కాకినాడకు చెందిన వంశీ అనే కానిస్టేబుల్ రాజమహేంద్రవరం రోడ్ కం రైలు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో దూకేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో కానిస్టేబుల్. వంశీకి పెళ్లి సంబంధం కుదరడంతో నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. కానిస్టేబుల్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. వంశీపై ఓ మహిళా కానిస్టేబుల్ రాజమహేంద్రవరం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆయన్ను పలుసార్లు పిలిచి విచారణ కూడా చేశారు. తాజాగా గురువారం పోలీసులు వంశీని పిలిచి మహిళా కానిస్టేబుల్ విషయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. వంశీ అర్ధరాత్రి దాటిన తర్వాత బయటకు వెళ్లారు.. తండ్రికి ఫోన్ చేసి క్షమించమని అడిగి.. తాన ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని చెప్పి రాజమహేంద్రవరం రోడ్ కం రైలు బ్రిడ్జిపైనుంచి గోదావరిలో దూకేశారు. వంశీ బైక్, చెప్పుల్ని గుర్తించి దూకేసినట్లు గుర్తించారు. శుక్రవవరం రోజు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపి గోదావరిలో గాలింపు చేపట్టారు.. అయితే ఎంత వెతికినా కానిస్టేబుల్ వంశీ ఆచూకీ లభ్యం కాలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.తన కుమారుడు వంశీకి పోలీసు ఉద్యోగమంటే చాలా ఇష్టమని తండ్రి వీర వెంకట్రావు చెబుతున్నారు. వంశీ ఎంతో కష్టపడి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడని.. పెళ్లి సంబంధం కూడా కుదిరిందన్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ తనను పెళ్లి చేసుకోవాలని వంశీని వేధించిందని.. ఆమె ఫిర్యాదు చేయడంతో వంశీకి పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారన్నారు. ఈ విషయం తమకు ఇటీవలే తెలిసిందని.. కుటుంబంతో కలిసి స్టేషన్కు వెళ్లామన్నారు. ఓ కానిస్టేబుల్ పెళ్లి చేసుకోవాలని అడగటంతో 10 రోజులు సమయం కావాలని వంశీ అడిగాడన్నారు. వంశీని మళ్లీ పోలీస్ స్టేషన్కు పిలిచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని.. లేనిపక్సంలో ఉద్యోగం పోతుందని చెప్పినట్లు వెంకట్రావు వివరించారు. గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో వంశీ బైక్పై బయటకు వెళ్లి ఫోన్ చేయడంతో.. తన పెద్ద కుమారుడు, స్థానికులు రాజమహేంద్రవరం రోడ్డుకం రైలు వంతెన దగ్గరకు వెళ్లారన్నారు.