
Veg Biryani with Leftover Rice: ఇంట్లో రాత్రి లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత అన్నం మిగిలిపోవడం సాధారణమే. చాలా మంది దానిని మళ్లీ తినడానికి ఇష్టపడక ఫ్రిజ్లో ఉంచేస్తారు లేదా చివరికి పారేస్తారు.
అయితే మిగిలిపోయిన అన్నంతో ఎంతో రుచికరమైన, సువాసనభరితమైన వెజ్ బిర్యానీని సులభంగా తయారు చేసుకోవచ్చు. సరైన మసాలాలు, కూరగాయలు జత చేస్తే ఈ బిర్యానీని పాత అన్నంతో చేశారని ఎవరూ గుర్తించలేరు.
* మిగిలిపోయిన చల్లటి అన్నం * ఉల్లిపాయ * టమాటా * క్యారెట్ * బీన్స్ * బఠానీలు వంటి కూరగాయలు.. * పెరుగు * అల్లం-వెల్లుల్లి పేస్ట్ * పచ్చిమిర్చి * బిర్యానీ మసాలా * ఇతర సుగంధ ద్రవ్యాలు అవసరం.
ముందుగా బాణలిలో నూనె లేదా నెయ్యి వేడి చేసి బే ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అనంతరం టమాటా, కూరగాయలు, మసాలా పొడులు వేసి బాగా ఉడికించాలి. మంటను తగ్గించి పెరుగు కలిపి మసాలా బాగా సిద్ధమైన తర్వాత మిగిలిపోయిన అన్నాన్ని వేసి నెమ్మదిగా కలపాలి. పైగా కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లి మూతపెట్టి తక్కువ మంటపై 5 నుంచి 7 నిమిషాలు ఉడికించాలి. అంతే.. వేడి వేడి, సువాసనతో నిండిన వెజ్ బిర్యానీ సిద్ధం.
దీనిని బూందీ రైతా లేదా ఉల్లిపాయ రింగులతో వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది. ఇకపై మిగిలిపోయిన అన్నాన్ని పారేయకుండా ఇలా వెజ్ బిర్యానీగా మార్చి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరచండి.