
హైదరాబాద్: విద్యార్థులు ఆత్మగౌరవంతో పాఠశాలకు వెళ్లేందుకు ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు.
విద్యపై నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీని గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి సీఎం ప్రారంభించారు. గురుకుల పాఠశాల విద్యార్థులకు 22 వస్తువులతో కిట్లు అందించారు. వసతి గృహ విద్యార్థులకు 10, పాఠశాల విద్యార్థులకు 7 వస్తువులతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్రెడ్డి మాట్లాడారు.
‘‘తెలంగాణ భాషా ప్రయుక్తరాష్ట్రంగానో, పాలనా సౌలభ్యం కోసమో ఏర్పడింది కాదు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, విద్యార్థుల ఆత్మ బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, ఉపాధి కోసం ఎంతోమంది త్యాగాలు చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది.. వాటిని పునరుద్ధరించాలి. విద్యాశాఖను గతంలో విధ్వంసం చేశారు. గత పాలకుల అరాచకంతో రాష్ట్రానికి వందేళ్ల నష్టం జరిగింది. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించి ప్రక్షాళన చేపట్టాం.
విధ్వంసమైన విద్యాశాఖను వికాసం వైపు నడిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం బడ్జెట్లో 8.5 శాతం నిధులు కేటాయించాం. వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం రూ.26,600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటిని భావితరాల భవిష్యత్తును నిర్ణయించే పెట్టుబడులుగా భావిస్తున్నాం. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇలా బోర్డు పెట్టే పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఉద్యోగులకు జీతాల మాదిరిగానే ప్రతినెలా ఒకటో తేదీన విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తాం’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.