
ఈ నెల(జూన్) 23 నుంచి జూలై 4 వరకు కర్కాటక రాశిలో మూడు సహజ శుభ గ్రహాల సంచారం జరుగుతోంది. ఇందులో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండి బుధ, శుక్రులతో యుతి చెందడం జరిగింది. ఈ మూడు శుభ గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేయడం చాలా అరుదు. ఈ అరుదైన కలయిక వల్ల కొన్ని రాశులవారికి తప్పకుండా యోగదాయకంగా, అదృష్టవంతంగా ఉండే అవకాశం ఉంది.
ఈ శుభ గ్రహాల కాండినేషన్ వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులవారికి రాజపూజ్యాలు, రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. వీరి జీవితం సానుకూల మలుపులు తిరుగుతుంది. మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర, గురు, బుధ గ్రహాల అనుకూల సంచారం వల్ల ఆర్థిక, ఉద్యోగ సంబంధమైన అదృష్టాలు కలుగుతాయి.
ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. అధికారులు, యజమానుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు నూరు శాతం ఫలితాలనిస్తాయి. సంపద బాగా వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మిథునం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి బుధుడితో గురు, శుక్రులు యుతి చెందడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ రెట్టింపు ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి.
ఉద్యోగంలో జీత భత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. కర్కాటకం: ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడంతో సహా మూడు శుభ గ్రహాలు కలవడం చాలా అరుదు.
ఈ శుభ గ్రహాల అనుకూలత వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెంది ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు
లోటుండదు. ఏ ఆదాయ వృద్ది ప్రయత్నమైనా తప్పకుండా విజయవంతమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు విశేషంగా లాభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి.
కన్య: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడు ఉచ్ఛస్థితిలో ఉన్న గురువును, శుక్రుడిని కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఉన్నత పదవులు లభిస్తాయి. జీత భత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి ప్రతిష్ఠలు వృద్ధి చెందుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి.
తుల: ఈ రాశికి దశమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు గురు, బుధుల అనుకూలత వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి పనీ, ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. షేర్లు, మదుపులు, పెట్టుబడుల వల్ల విశేష లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి.
మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్ర, గురు, బుధులు సంచారం చేస్తున్నందువల్ల రాజ యోగాలు, ధన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగుతాయి. షేర్లు, ఆర్థిక లావాదేవీలతో పాటు అనేక మార్గాలో ఆదాయం వృద్ధి చెందుతుంది. జీతభత్యాలు పెరగడం, రాబడి అంచనాల్ని మించడం వంటివి కూడా జరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.