Hyderabad 1901 Census History : ఆధునిక సాంకేతికత, కంప్యూటర్లు, కాలిక్యులేటర్లు అందుబాటులోకి రాకముందు.. అదీ నూట ఇరవై ఏళ్లకు పైగా సుదీర్ఘ కాలం క్రితమే హైదరాబాద్ సంస్థానంలో అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన పద్ధతిలో జనాభా గణన జరిగిందన్న విషయం మీకు తెలుసా?
1901లో నిజాం పరిపాలన సాగుతున్న కాలంలో.. అప్పటి జనాభా లెక్కల అధికారులు కేవలం రంగు రంగుల కాగితపు స్లిప్పులు, ప్రత్యేక శారీరక, సామాజిక గుర్తులను ఉపయోగించి సమగ్ర జనాభాను లెక్కించారు. నాటి హైదరాబాద్ సంస్థానంలో జరిగిన రెండో జనాభా గణనలో ప్రవేశపెట్టిన ఈ వినూత్న పద్ధతికి సంబంధించిన పలు ఆసక్తికరమైన చారిత్రాత్మక విశేషాలు ఆర్కైవ్స్ రికార్డుల ద్వారా వెలుగులోకి వచ్చాయి.
ఆ పూర్తి వివరాలు మీకోసం. టాలీ మార్కులకు స్వస్తి.. జర్మనీ టెక్నాలజీకి జై!నిజాం రాజ్యంలో.. ముఖ్యంగా 1891 సమయంలో మొదటిసారి జనాభా గణన నిర్వహించినప్పుడు.. వ్యక్తుల వివరాలను నమోదు చేయడానికి కాగితాలను వాడేవారు. ముఖ్యంగా ఇందుకోసం ఆ కాగితాలపై గీతలు గీయడం అనే సాంప్రదాయ పద్ధతిని వాడేవారు.
అయితే ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకోవడమే కాకుండా, శ్రమతో కూడుకున్నదిగా, తప్పులు దొర్లడానికి ఆస్కారం ఉన్నదిగా ఉండేది. దీంతో నాటి ప్రముఖ గణాంక నిపుణులు ఈ పాత పద్ధతిని నమ్మదగనిదిగా పెదవి విరిచారు. దీనిని అధిగమించడానికి హైదరాబాద్ సెన్సస్ ఆపరేషన్స్ అధిపతిగా ఉన్న 'మీర్జా మెహదీ ఖాన్' సరికొత్త ఆలోచన చేశారు.
1871లో జర్మనీలోని 'బవేరియన్ జనాభా గణన'లో విజయవంతంగా ఉపయోగించిన కాగితపు స్లిప్పుల విధానాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఆ విదేశీ పద్ధతిని భారతదేశ పరిస్థితులకు, స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చి.. మరింత సులభతరంగా మార్పులు చేసి 1901 జనాభా లెక్కింపులో ప్రవేశ పెట్టారు.మతం, లింగం, వైవాహిక స్థితి ఆధారంగా రంగుల స్లిప్పులు..!ఈ సరికొత్త విధానంలో భాగంగా గణన అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి నివాసితుల మతం ఆధారంగా వేర్వేరు రంగుల కాగితపు స్లిప్పులను పంపిణీ
చేసేవారు. హిందువులను లెక్కించేందుకు గోధుమ రంగు స్లిప్పులు, ముస్లింలను గుర్తించేందుకు పచ్చ రంగు స్లిప్పులను, క్రైస్తవుల కోసం గులాబీ రంగు స్లిప్పులను, జైనుల జనాభాను లెక్కించేందుకు నీలం రంగు స్లిప్పులను ఉపయోగించారు. ఇతర మతాలు, విశ్వాసాల వారి కోసం తెలుపు రంగు స్లిప్పులను కేటాయించారు. కేవలం మతాన్నే కాకుండా సదరు వ్యక్తి లింగం, వైవాహిక స్థితిని కూడా సులభంగా తెలుసుకునేందుకు ఈ స్లిప్పులపై ప్రత్యేక రేఖాచిత్రాలు, ముద్రణ గుర్తులను ముద్రించారు. పురుషులు, మహిళలు, అవివాహితులు, వివాహితులు, వితంతువులను గుర్తించడానికి వేర్వేరు మార్కింగ్లు ఉండేవి. సమాచారం సేకరించిన అనంతరం, ఆ స్లిప్పులను వివిధ రంగులు, చిహ్నాల వారీగా వేరు చేసి లెక్కించేవారు. దీనివల్ల సంస్థానంలోని జనాభా మిశ్రమం, స్త్రీ-పురుష నిష్పత్తి లాంటి కీలక గణాంకాలు చాలా ఖచ్చితంగా వెల్లడి అయ్యాయి.సమయం, శ్రమ, ధనం.. ఇలా అన్నీ ఆదా!మీర్జా మెహదీ ఖాన్ తన అధికారిక నివేదిక 'సెన్సస్ ఆఫ్ ఇండియా 1901 (వాల్యూమ్ XXII - హైదరాబాద్)' లో పేర్కొన్నట్లుగా.. ఈ మోడిఫైడ్ బవేరియన్ విధానం హైదరాబాద్లో అద్భుత ఫలితాలను ఇచ్చింది. పాత పద్ధతితో పోలిస్తే ఈ రంగుల కాగితాల లెక్కింపు వల్ల సమయం, శ్రమ, ప్రభుత్వ ధనం భారీగా ఆదా అయ్యాయి. అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని తక్కువ ఖర్చుతో క్రోడీకరించడంలో నిజాం రాచరిక రాష్ట్రం సాధించిన ఈ ప్రయోగం నాటి భారతదేశ జనాభా గణన చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది.