
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Land Registration: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు , స్థలాలు కొనుగోలు చేసే వారితో పాటు రిజిస్ట్రేషన్ పనుల కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజలకు రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఒక కీలకమైన సమాచారాన్ని అందించింది. ఆ శాఖకు సంబంధించిన ప్రధాన వెబ్సైట్ తో పాటు దానికి అనుబంధంగా పనిచేసే అన్ని ఆన్లైన్ సర్వీసులు ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని వెల్లడించింది.
సర్వర్ల ఆధునీకరణ షెడ్యూల్ చేసిన సాంకేతిక నిర్వహణ పనుల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రిజిస్ట్రేషన్ శాఖలో దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ స్థాయి సర్వర్ నిర్వహణ పనులు అధికారులు చేపట్టమన్నారు. ఈ పనుల ద్వారా శాఖకు సంబంధించి ఆన్లైన్ సర్వర్ వ్యవస్థలు భవిష్యత్తులో మరింత సజావుగా ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా పనిచేస్తాయి.
అంతేకాదు వినియోగదారుల డేటా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం ప్రజలకు అందించే సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం ఈ తాత్కాలిక సాంకేతిక విరామం తప్పనిసరి అయిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మూడు రోజుల విరామం వల్ల ప్రజలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఈ షెడ్యూలు రూపొందించారు.
జూన్ 26వ తేదీన మొహర్రం పండుగ సందర్భంగా గవర్నమెంట్ హాలీడే ఉంది. అలాగే జూన్ 28వ తేదీన ఆదివారం కావడం వల్ల ఆ రోజు కూడా ప్రభుత్వ అధికారిక సెలవు దినం అవుతుంది. కాబట్టి ఈ రెండు సెలవులకు మధ్యలో జూన్ 27వ తేదీన ఒక్కరోజు మాత్రమే ప్రభుత్వ
పని దినముగా ఉంటుంది. ఫలితంగా కేవలం ఒకే ఒక వర్కింగ్ డే రోజు మాత్రమే రిజిస్ట్రేషన్ సర్వీస్ కు అంతరాయం కలుగుతుందని ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
సాధారణ ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని వీలైనంతవరకు తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ మూడు రోజుల సమయాన్నితీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భూములు, ఇల్ల రిజిస్ట్రేషన్లు చేయాలనుకునే ప్రజలు ఈ మూడు రోజుల విరామాన్ని గమనించాలని అధికారులు సూచించారు. తమ రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను స్లాట్ బుకింగ్స్‌ను ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 29వ తేదీ ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వీస్ లో ఎప్పటి వలే యథాతథం పునర్ ప్రారంభమవుతాయని తెలిపారు. శాఖను సాంకేతికంగా మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న ఈ నిర్వహణ పనులకు ప్రజలు డాక్యుమెంట్ రైటర్స్, రియాల్టర్లు పూర్తిగా సహకరించాలని రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.