Telangana Woman Missing Istanbul : అమెరికా నుంచి సొంత గడ్డకు తిరిగి వస్తున్న తెలంగాణకు చెందిన ఒక యువతి టర్కీలోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పద స్థితిలో అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన బొమ్మ రాజశ్రీ అనే యువతి ప్రయాణ మధ్యలో విమానాశ్రయం నుంచే అదృశ్యమవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. టర్కీలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. యువతి జాడ కనిపెట్టేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గురువారం ఇస్తాంబుల్ కాన్సులేట్‌కు అత్యవసర సందేశం పంపారు.హూస్టన్ టు హైదరాబాద్ ప్రయాణం..
మధ్యలోనే మాయం!బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. రాజశ్రీ ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. అక్కడ మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన ఆమె.. తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు జూన్ 14వ తేదీన అమెరికాలోని హూస్టన్ నగరం నుంచి టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం (టీకే-34) ఎక్కారు.
టర్కీ కాలమానం ప్రకారం అదే రోజు సాయంత్రం 4.46 గంటలకు విమానం ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. షెడ్యూల్ ప్రకారం ఆమె అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు మస్కట్ మీదుగా హైదరాబాద్ రావాల్సిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ కనెక్టింగ్ ఫ్లైట్ (టీకే-774) ఎక్కాల్సి ఉంది.
అయితే రాజశ్రీ మస్కట్ వెళ్లే విమానం ఎక్కలేదని ఎయిర్పోర్ట్ రికార్డుల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. ఆమె ప్రయాణ టికెట్లపై వీల్‌చైర్ అసిస్టెన్స్ అని కూడా ఉండగా.. ఆమె అదృశ్యం అవడంతో అంతా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా విమానాశ్రయం దిగిన తర్వాత ఆమె ఏమైంది?
ఎటు వెళ్లింది? అనే విషయాలపై ఎయిర్పోర్ట్ లేదా విమానయాన సంస్థల నుంచి ఎలాంటి సమాచారం లభించలేదు. ఆమె లగేజీ ఎక్కడుందనే దానిపై కూడా స్పష్టత లేదు.తండ్రి మరణంతో డిప్రెషన్లో రాజశ్రీ..రాజశ్రీ
తల్లి దూదిపాల జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో విమానం ఎక్కే ముందు రాజశ్రీ తనతో ఫోన్లో మాట్లాడిందని, ఆ తర్వాత నుంచి ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని కన్నీరుమున్నీరయ్యారు. కొంతకాలం క్రితం తండ్రి మరణించడంతో రాజశ్రీ తీవ్ర మానసిక వేదనకు లోనైందని, ఈ క్రమంలోనే ఆమె అదృశ్యం కావడం మరింత భయాందోళనలకు గురిచేస్తోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యువతి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇస్తాంబుల్ స్థానిక పోలీసులు, ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందితో దౌత్యపరమైన సంప్రదింపులు జరపాలని సీఎస్ రామకృష్ణారావు టర్కీలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. రాజశ్రీతో పాటు అమెరికా, తెలంగాణలోని ఆమె బంధువుల ఫోన్ నెంబర్లను కాన్సులేట్‌కు అందజేశారు.ఇదిలా ఉండగా.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ చామల ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాజశ్రీ అదృశ్యం కావడంపై తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని, ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. భారత రాయబార కార్యాలయం ద్వారా ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ సీసీటీవీ దృశ్యాలను, ట్రావెల్ స్టేటస్‌ను నిరంతరం ట్రాక్ చేస్తున్నామని, యువతిని సురక్షితంగా రప్పించేందుకు అన్ని అధికారిక, దౌత్య మార్గాలను ఉపయోగిస్తున్నామని ఆయన వెల్లడించారు.