
ఇంటర్నెట్ డెస్క్: సెలబ్రిటీల బరువుకు సంబంధించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం సమంత లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె డైటింగ్ చేసి చాలా సన్నగా అయ్యారని కొందరు కామెంట్స్ చేశారు.
తాజాగా వాటిపై ఆమె స్పందించారు. మయోసైటిస్ కారణంగా తాను ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి వచ్చిందని దాని కారణంగానే తాను (Samantha) సన్నగా అయినట్లు తెలిపారు. ఎదుటివారి గురించి జనాలు సులభంగా కామెంట్ చేసేస్తారని అసహనం వ్యక్తంచేశారు.
‘‘గతంతో పోలిస్తే ఇప్పుడు నేను కావాల్సింది తినగలుగుతున్నా. మరీ ఎక్కువ తిన్నా కూడా మయోసైటిస్కు ఎఫెక్ట్ అవుతుందని మితంగా తింటున్నా. చాలామంది నేను కనిపించగానే ‘ఎందుకు బరువు తగ్గావు’ అని అడుగుతుంటారు. ఒకరి జీవితంలో ఏం జరుగుతుందో ప్రజలకు ఎప్పటికీ తెలియదు.
నేను కావాలని డైటింగ్ చేసి బరువు తగ్గలేదు. నాకు తినాలని ఉన్నా కూడా తినలేని పరిస్థితి. అందుకే తినలేకపోయాను’’ అని చెప్పారు. ఇక తన పెంపుడు పిల్లికి జెలాటో అనే ఐస్ క్రీమ్ పేరు పెట్టడం వెనక ఉన్న కారణాన్ని కూడా సమంత వివరించారు.
తాను రెండేళ్లు ఆహారం సరిగ్గా తీసుకోలేదని.. ఏం తిన్నా రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపేదని చెప్పారు. పరిమితంగా ఉప్పు, కారం లేకుండా ఒకేరకమైన ఆహారం రెండేళ్లు తీసుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత డాక్టర్లు అనుమతించిన మొదటి పదార్థం ‘జెలాటో’ ఐస్ క్రీమ్ అని అది కూడా చక్కెర లేకుండా తినాలని సూచించినట్లు తెలిపారు.
తాను ఆ ఐస్‌క్రీమ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసేదానినన్నారు. అందుకే తన పెంపుడు పిల్లికి ఆ పేరు పెట్టినట్లు చెప్పారు. ఇక సినిమా విషయానికొస్తే.. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ సొంతం చేసుకుంటోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని
ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.