
తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో అల్లాడిపోతున్న తెలంగాణ, పొరుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఉపశమనం కలిగించే చల్లని కబురు అందించింది. వచ్చే నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణతో పాటు ఒడిశా, ఝార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రకటించింది.
ఈ ప్రాంతాల్లో కొంతకాలంగా పొడి వాతావరణం, తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో, రుతుపవనాల రాకతో వచ్చే వారం నుంచి వర్షాలు ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్ నినో ప్రభావం కారణంగా నైరుతి రుతుపవనాల గమనం సాధారణం కంటే చాలా నెమ్మదిగా సాగుతోంది.
దీనివల్ల దేశవ్యాప్తంగా వర్షాలు ఆలస్యం కావడమే కాకుండా, అనేక రాష్ట్రాల్లో వర్షపాత లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఐఎండీ నివేదికల ప్రకారం దేశంలోని 741 జిల్లాల్లో 239 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కాగా, మరో 230 జిల్లాల్లో అత్యంత తీవ్రమైన వర్షపాత లోటు ఏర్పడింది.
ఈ జాప్యం ఖరీఫ్ సీజన్ సాగుపై, తాగునీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో అటు వ్యవసాయ రంగం, ఇటు ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.తెలంగాణలో రుతుపవనాలు విస్తరిస్తాయని చెబుతున్నప్పటికీ.. జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో కూడా ఈ ఎండల తీవ్రత కొనసాగనుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు