
విజయ్ ఆంటోనీ చిత్రాలు అంటే మినిమం గ్యారెంటీ, ఏదో ఒక కాన్సెప్ట్, కంటెంట్ ఉంటుంది.. మరీ అంత తీసిసారేసేలా అయితే ఉండదు అని ఓ నమ్మకం తెలుగు ఆడియెన్స్‌లో ఉంటుంది. అందుకే బిచ్చగాడు తరువాత ఆ రేంజ్ హిట్ లేకపోయినా ఇన్నేళ్లు కూడా సర్వైవ్ అవుతున్నారు.
ఏదో ఒక కొత్త ప్రయోగం చేస్తూ ఆడియెన్స్‌ని మళ్లీ ఆ రేంజ్లో మెప్పించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తన మేనల్లుడు అజయ్ ధీషాన్ను హీరోగా నిలబెట్టాలని కూడా చూస్తున్నాడు. మరి ఈ ‘వంద దేవుళ్లు’ అనే సినిమాతో విజయ్ ఆంటోనికి, అతని మేనల్లుడు అజయ్‌కి హిట్ వచ్చిందా?
లేదా? అన్నది చూద్దాం. కథ కట్టుబాట్ల పేరుతో ఆడవాళ్లని బానిసలా కట్టి పడేసే గ్రామం. అలాంటి ఊర్లో వాసవి (శ్వాసిక) ఒంటరిగా మహిళగా ఎన్నో కష్టాలు పడుతూ ఇద్దరు పిల్లల్ని భాస్కర్ (అజయ్ ధీషాన్), వివేక్ (శక్తి) పెంచి పోషిస్తుంటుంది.
యవ్వనంలోనే భర్తను కోల్పోయి వితంతవులా ఊర్లో ఉండే ఆడవాళ్లని ఏ రకంగా చూస్తారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒంటరి మహిళ అంటే అందరికీ చిన్న చూపే. ఇలాంటి ఓ సమాజంలో వాసవి ఎలా మనుగడ సాధించింది? తన పిల్లల్ని ఎలా పోషించుకుంది?
ఒకానొక సమయంలో పెళ్లి చేసుకోవాలన్న వాసవి కోరికను తెలుసుకున్న యవ్వనంలో ఉన్న కుర్రాడు భాస్కర్ ఏం చేశాడు? ఆ తరువాత మనిషిలా ఎదిగి.. కాస్త ఆలోచించి.. తల్లికి పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చిన భాస్కర్ ఏం చేశాడు? మరి ఈ నిర్ణయాన్ని చిన్న కొడుకు వివేక్ ఒప్పుకుంటాడా?
నలభై వచ్చాక పెళ్లి అనే ఆలోచనను వాసవి ఎలా తీసుకుంటుంది? ఆడది అంటే కట్టుబానిస అని అనుకునే ఆ ఊరు ఎలా రియాక్ట్ అయింది? ఈ కథలో ఏడు కొండలు (విజయ్ ఆంటోని) పాత్ర ఏంటి? చివరకు కథ ఎలా ముగుస్తుంది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
పురుషుడు ముప్పై, నలభై, యాభై
ఇలా ఎన్ని ఏళ్లు వచ్చినా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అసలు ఆ విషయానికి వస్తే పురుషుడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఈ సమాజం అంతగా పట్టించుకోదు. అదొక నేరంగా భావించదు. కానీ స్త్రీ మాత్రం మగాడికి బానిసలానే ఉండాలని, భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకోవడం ఓ నేరంగానే చూస్తారు.. పురుషుడి రెండో పెళ్లిని సాదాసీదాగా చూసే ఈ సొసైటీ.. స్త్రీ రెండో పెళ్లిని మాత్రం ఓ పెద్ద తప్పుగా, చేయరాని నేరంగా చూస్తుంటుంది. కానీ ఆడవాళ్లకి కూడా మగవాళ్లనే కోరికలు, హక్కులు సమానంగానే ఉంటాయి.. ఆడవాళ్లు కూడా మగవాళ్లలానే రెండో పెళ్లి చేసుకోవాలి.. వారికంటూ ఓ జీవితం ఉందని గుర్తించాలి.. యవ్వనంలో భర్తను కోల్పోయినా.. వృద్దాప్యం వరకు అలానే ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు అని ఓ సందేశాన్ని ఇచ్చే చక్కటి చిత్రమే ‘వంద దేవుళ్లు’. దర్శకుడు శశి ఇలాంటి ఓ మంచి పాయింట్‌ను ప్రేక్షకుడికి చెప్పాలని ప్రయత్నించారు. ‘వంద దేవుళ్ళు’ పాయింట్ వరకు బాగుంటుంది. ‘మా నాన్నకి పెళ్లి’ అనే సినిమా మన తెలుగు వారికి సుపరిచితమే. ఇక ఈ ‘వంద దేవుళ్ళు’ సినిమాకి ‘మా అమ్మ పెళ్లి’ అనే టైటిల్ పెడితే యాప్ట్‌గా ఉండేదేమో. ఇందులో అమ్మ పెళ్లి చుట్టూనే కథ, కథనం తిరుగుతుంది. ప్రారంభ సన్నివేశాలు, వాసవి ఎదుర్కొనే అవమానాలు, రెండో పెళ్లి అనే కోరిక కలగడం, కొడుకు అసహ్యించుకునే సీన్లు ఇలా ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేసేలా సాగుతాయి. ఆ తరువాత కథనం గాడి తప్పినట్టు అనిపిస్తుంది. ఇద్దరు కొడుకుల కథను చూపించడం, చిన్నోడి ప్రేమ కథ, అమ్మ పెళ్లి చేయాలని పెద్దోడు ప్రయత్నించడం.. ఇలా సన్నివేశాలు అంత మనసుకి హత్తుకునేలా సాగవు. ఇంటర్వెల్‌కి, అక్కడ జరిగే ప్రమాదంతో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ద్వితీయార్దంలో కాస్త కథ ప్రారంభం అయినట్టుగా ఉంటుంది. కానీ వాసవి పెళ్లి అనే ఒక్క కాన్సెప్ట్‌తోనే ఇంత వరకు సాగదీశారే అనే ఫీలింగ్ వస్తుంది. అప్పటి వరకు ఓ ఫేజ్‌లో నడుస్తున్న సినిమా ఏడు కొండలు పాత్ర ఎంట్రీతో మరో ఫేజ్‌లోకి వెళ్తుంది. విజయ్ ఆంటోనీ కనిపించేది చాలా కొద్ది సేపే అయినా ఎంతో ప్లెజెంట్‌గా, పాజిటివ్‌గా అనిపిస్తుంది. ఈ మూవీకి ప్లస్ పాయింట్ అంటే విజయ్ ఆంటోనీ కనిపించే నాలుగైదు సీన్లే అని చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్‌ని ఎమోషనల్‌గా కాకుండా.. కాస్త కామెడీ టచ్‌తో ముగించారు. అక్కడ కాస్త నిరాశ కలగవచ్చు. ఓ బలమైన ఇంపాక్ట్ కలిగించేలా క్లైమాక్స్‌ను డిజైన్ చేస్తుంటారు సాధారణంగా. కానీ ఇందులో కాస్త భిన్నంగా ట్రై చేశారు. నటీనటుల విషయానికి వస్తే ఈ కథకి అసలు హీరో శ్వాసిక. ఆమె పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. శ్వాసిక నటన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది. నలభై ఏళ్ల మహిళగా శ్వాసిక కనిపించే తీరు, ఆమె లుక్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. ఎన్నో సన్నివేశాల్లో శ్వాసిక నటనకు, డైలాగ్స్‌కి ఆడియెన్స్ చప్పట్లు కొడతారు. భాస్కర్ పాత్రలో అజయ్ ధీషాన్ పర్వాలేదనిపిస్తుంది. మెల్లిగా నటనలోనూ ఇంప్రూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. వివేక్, సంధ్య, వందన, పెద్ది రెడ్డి ఇలా చాలా వరకు పాత్రలు ఓకే అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి స్పెషల్ గెస్ట్‌గా విజయ్ ఆంటోని నిలబడిన తీరు బాగుంటుంది. ఉండేది కొద్ది సేపే అయినా, కనిపించేది కొన్ని సీన్లలోనే అయినా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. సాంకేతిక బృందం విషయానికి వస్తే.. ‘వంద దేవుళ్ళు’ మ్యూజిక్, విజువల్స్ ఇవన్నీ కూడా ఎంతో సహజంగా ఉంటాయి. కథకు తగ్గట్టుగానే ప్లెజెంట్‌గా ఉంటుంది. ఆర్ఆర్, పాటలు కథలో భాగంగానే వస్తుంటాయి. నీలానే ఉండాలనిపిస్తోంది.. నీతోనే ఉండాలనిపిస్తోంది.. లాంటి డైలాగ్స్ మాత్రం గుండెల్ని తాకేలా ఉంటాయి. పాటలు వినసొంపుగా ఉంటాయి. ఎడిటింగ్ బాగుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే ఇలాంటి కథను ఇంకాస్త డెప్త్‌గా చెప్పొచ్చు. చివరకు ఇదొక రియల్ స్టోరీ అని ఎండ్ కార్డ్ వేశారు. ఇలాంటి రియల్ స్టోరీలను మరింత రియలిస్టిక్‌గా, ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చూపించొచ్చు. పాయింట్ వరకు బాగానే అనిపించినా.. పూర్తి సినిమాగా మాత్రం ఆడియెన్స్ అందరినీ మెప్పించకపోవచ్చు. ఇది పూర్తిగా విజయ్ ఆంటోని సినిమా అని థియేటర్‌కి వస్తే మాత్రం ఆడియెన్స్ కచ్చితంగా నిరాశచెందుతారు.