గతవారం అసోంలోని జోర్హాట్లో ఉన్న రౌరియా వైమానిక కేంద్రం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో వీరమరణం పొందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్‌కు అధికారిక లాంఛనలతో తన స్వస్థలం బిహార్‌లో అంత్యక్రియులు నిర్వహించారు
. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన కొద్ది రోజులకే శుభమ్ కుటుంబం తీవ్రమైన ఆరోపణలు చేశారు. శుభమ్ ‘భార్య’అని చెప్పుకుంటున్న ఒక యువతికి రూ. 21 లక్షల పరిహారం చెక్కును అందజేశారని, తమకు ఈ విషయం అసలు చెప్పనే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్మకాండలు ముగియకముందు ఆమె ఆ చెక్కును తీసుకుని వెళ్లిపోయిందని తెలిపారు. తమ బిడ్డను పోగొట్టుకున్న బాధ నుంచి ఆ కుటుంబం, బంధువులు ఇంకా తేరుకోకముందే ఈ వివాదం తెరపైకి రావడం బాధాకరం.కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన శ్రేయ రాయ్ అనే యువతితో శుభమ్ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలుసు. ఈ బంధానికి తాము అభ్యంతరం చెప్పలేదని, వారి పెళ్లికి కూడా అంగీకరించామని వారు తెలిపారు. ఈ ఏడాది చివర్లో వివాహం జరగాల్సి ఉండగా, శుభమ్ నాయినమ్మ మరణించడంతో వాయిదాపడిందని చెప్పారు. ప్రమాదంలో శుభమ్ మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహంతో పాటు గ్రామానికి వచ్చిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొంది. చివరి వరకు కుటుంబ సభ్యులతోనే ఉండి వీడ్కోలు పలికింది. కానీ, అంత్యక్రియలు పూర్తయిన వెంటనే పరిహారం చెక్కు ఆమెకు అందినట్లు శుభమ్ తండ్రి అమరేంద్ర శర్మకు తెలియడంతో ఈ వివాదం మొదలైంది.పరిహారం పంపిణీ చేసిన తీరును అమరేంద్ర శర్మ బహిరంగంగానే ప్రశ్నించారు. చెక్కు అందజేసే సమయంలో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, అంత్యక్రియలు ముగించుకుని ఇంటికి చేరకున్నాకే ఈ విషయం తెలిసిందని ఆయన చెప్పారు. ‘‘శ్రేయ రాయ్‌కు చెక్కు అందిన విషయం అధికారులను కలిసిన తర్వాతే తెలిసిందని, వారిద్దరికీ చట్టబద్ధంగా వివాహం జరిగుంటే ఆమె ఆ హక్కు ఉంటుంది.. కానీ, వారిద్దరికీ కోర్టులో వివాహం జరిగినట్లు మా కుటుంబానికి ఎలాంటి సమాచారం లేదు’’ అని అమరేంద్ర శర్మ పేర్కొన్నారు.శుభమ్ మరణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన అమరేంద్ర శర్మ.. తమది సాధారణ మధ్యతరగతి కుటుంబమని వాపోయారు. తన కుమారుడు మాత్రమే కుటుంబానికి ప్రధాన ఆధారమని, అతడి మరణం తమ జీవితాల్లో ఆర్థికంగా, మానసికంగా ఎవరూ పూడ్చలేని లోటును మిగిల్చిందని కన్నీటిపర్యంతమయ్యారు. అమర జవాన్ల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం నుంచి తమను మినహాయించవద్దని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. పరిహారం ప్రక్రియ గురించి తమకు ముందే చెప్పి, కుటుంబంతో చర్చించి ఉంటే బాగుండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.