వర్షాకాలం ప్రారంభమవుతోంది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో.. హైడ్రా అప్రమత్తమైంది.ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది.
ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ హైడ్రా సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. వర్షాకాలం అప్రమత్తంగా ఉండి.. నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా సిబ్బందికి సూచించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా.. ఉన్నట్లుండి భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రజలకు వరద కష్టాలు లేకుండా జాగ్రత్త పడగలమని సూచించారు. శనివారం రోజున జలవిహార్‌లో మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లతో హైడ్రా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా హైడ్రా సిబ్బందికి, మాన్సూన్ రెస్పాన్స్ టీమ్‌లకు కీలక సూచనలు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 150 రోజులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.చెట్టుకొమ్మలు విరిగిపడడం.. కరెంటు తీగలు తెగిపడడం వంటి కారణాలతో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని అన్నారు ప్రభుత్వం, హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, అగ్నిమాపక, వాతావరణ శాఖలు 24 గంటలూ సమన్వయంతో పనిచేస్తున్నాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత ఉంటే.. చాలావరకు వరదలను కట్టడి చేయవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ దిశగా అన్ని శాఖలు కలసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతలు వరదల కట్టడితో పాటుగా వేసవి కాలం నీటి ఎద్దడి నివారణకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కులు, స్థలాలు కబ్జా కాకుండా హైడ్రా చర్యలు చేపడుతోందని పొన్నం ప్రభాకర్ కొనియాడారు. మరోవైపు వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 51 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, 300 మాన్సూన్ రెస్పాన్స్ బృందాలు, 889 స్టాటిక్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ సందర్భంగా వివరించారు. చెట్లు కూలిన ఘటనల్లో వేగంగా స్పందించేందుకు 20 బైక్ క్విక్ రెస్పాన్స్ యూనిట్లు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు తొలగించేందుకు 371 డీ-వాటరింగ్ పంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 60 ఫ్లైఓవర్లు, 38 అండర్‌పాస్‌లతో పాటుగా 705 చెరువులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు.