ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మానవత్వాన్ని చాటుకున్నారు.జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన అభిమాని కోరికను మన్నించి, స్వయంగా అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండకి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు.
తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ని కలవాలని కోరుకున్నాడు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి.. బుధవారం నిరంజన్ ఇంటికి వెళ్లారు. ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ' ఓజీ 2 'లో స్పెషల్ గెస్ట్ రోల్ ఇస్తానని అభిమానికి పవన్ మాటిచ్చారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''మనిద్దరం కలిసి 'ఓజీ' సినిమా చూద్దాం. నేను 'OG 2' చేస్తే దాంట్లో నువ్వే స్పెషల్ గెస్ట్. నిన్ను కచ్చితంగా మళ్లీ పిలిపిస్తాను. ఇంకోసారి నీకోసం వస్తాను. నువ్వు అడిగింది చేస్తాను. ఐప్యాడ్ లో సినిమాలన్నీ పంపిస్తాను.
దాంట్లో 'ఓజీ' సినిమా కూడా పెట్టమని చెప్తాను'' అని అన్నారు. 'సినిమాలు డౌన్ లోడ్ చేసి ఐప్యాడ్ లో పెట్టొచ్చా?' అని పవన్ పక్కనే ఉన్న అతన్ని అడుగుతుండగా.. తన దగ్గర ఒక యాప్ ఉందని, కొత్త సినిమాలన్నీ అందులో చూస్తానని, 'ఓజీ' & 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు కూడా దాంట్లో ఉన్నాయని అభిమాని బదులిచ్చాడు.
దాంతో పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరంజన్ ను చూసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా హత్తుకున్నారు.
నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. అతడితో చాలా సమయం గడిపారు. తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మనో ధైర్యం నింపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని
అతనికి కప్పి, కళ్యాణం అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేయిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు.నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఆయన్ని అనుకరిస్తూ చేసిన డాన్స్ వీడియోలు, ఫొటోలను పవన్ కళ్యాణ్ తిలకించారు. ఈ సందర్భంగా అంతా తనని 'చోటా గబ్బర్ సింగ్' అని పిలుస్తారని నిరంజన్ చెప్పాడు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్లని పెంచుకోవాలని ఉందని చెప్పగా, తాను పంపుతానని పవన్ హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి ఇంటి ఓనర్స్ అనుమతి కావాలని నిరంజన్ తండ్రి చెప్పగా, స్వయంగా ఆ ఇంటి ఓనర్ ని పిలిపించి మాట్లాడారు. నిరంజన్ ను పరామర్శించిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శంకర్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ఆర్ కె సాగర్ తదితరులు ఉన్నారు.