US Drops Indo Command : అంతర్జాతీయ రక్షణ, దౌత్య రంగాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గత కొన్ని సంవత్సరాలుగా కొనియాడుతూ వచ్చిన అమెరికా.. ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది.
ఈ రీజియన్లో సేవలు అందించే తన అత్యంత శక్తివంతమైన సైనిక కమాండ్ పేరు నుంచి ‘ఇండో’ అనే పదాన్ని తొలగిస్తూ అగ్రరాజ్యం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా తమ అధికారిక వెబ్సైట్లో భారతదేశ చిత్రపటాన్ని తప్పుగా ప్రదర్శించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
ఇటలీలో జరుగుతున్న జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడానికి సరిగ్గా కొన్ని గంటల ముందే ఈ పరిణామం జరగడం గమనార్హం.పాత పేరుకే మొగ్గు చూపిన పెంటగాన్..చారిత్రక రక్షణ విభాగమైన ‘యూఎస్ ఇండో పసిఫిక్ కమాండ్’ పేరును మళ్లీ పాతపద్ధతిలోనే ‘యూఎస్ పసిఫిక్ కమాండ్’గా మారుస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. "మా సైనిక విభాగానికి ఉన్న చారిత్రక మూలాలను గౌరవించడం, పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులలో సరికొత్త స్ఫూర్తిని నింపడం కోసమే ఈ పాత పేరును పునరుద్ధరించాలని నిర్ణయించాం" అని అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
నిజానికి 1947 జనవరి 1న నాటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్. ట్రుమ్యాన్ ఈ పసిఫిక్ కమాండ్ను ఏర్పాటు చేశారు. అమెరికా పశ్చిమ తీరం నుంచి భారత పశ్చిమ తీరం వరకు విస్తరించి ఉన్న ఈ దళం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో కీలక పాత్ర పోషించింది.
ముఖ్యంగా కొరియా, వియత్నాం యుద్ధాలతో పాటు ఎన్నో మానవతా దృక్పథ ఆపరేషన్లలోనూ భాగస్వామి అయింది. అయితే ట్రంప్ తన తొలి విడత అధికారంలో ఉన్నప్పుడు అంటే 2018లో హిందూ మహాసముద్రం
ప్రాధాన్యతను గుర్తిస్తూ దీని పేరులో ‘ఇండో’ అనే పదాన్ని చేర్చారు. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ట్రంప్ హయాంలోనే ఆ పదాన్ని తొలగించడం అంతర్జాతీయ దౌత్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.మ్యాప్ వివాదంతో పెరిగిన ఉద్రిక్తత..కేవలం పేరు మార్పుతోనే ఆగకుండా.. ఈ కమాండ్ పరిధిని వివరించేందుకు అమెరికా రక్షణ శాఖ తన వెబ్సైట్లో ఉంచిన ఒక మ్యాప్ తీవ్ర వివాదాస్పదమైంది. అందులో భారత దేశానికి చెందిన ‘పాక్ ఆక్రమిత కశ్మీర్’ ప్రాంతాన్ని పాకిస్థాన్ భూభాగంలో కలిపి చూపించారు. భారత్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రపటంపై రక్షణ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు ప్రధాని మోదీ కాని అటు ట్రంప్ కాని దీనిపై అధికారికంగా స్పందించలేదు.