
ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీఈసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను మంగళవారం ప్రకటించారు. ఈ ఏడాది పీఈసెట్లో మొత్తం 89.76 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన తెలిపారు.ఫలితాల వివరాల్లోకి వెళితే, పీఈసెట్-2026 కోసం మొత్తం 4,037 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 2,958 మంది పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో 2,655 మంది అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో పురుషులు అధికంగా ఉన్నారు. పరీక్షకు హాజరైన పురుషుల్లో 92.91 శాతం (1,993 మంది) ఉత్తీర్ణులు కాగా, మహిళల్లో 81.43 శాతం (662 మంది) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, ఫిజికల్ ఎడ్యుకేషన్, క్రీడల రంగంలో కెరీర్ను ఎంచుకునే దిశగా ముందడుగు వేసిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
వారి భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in/PECET/ లో చూసుకోవచ్చు. ర్యాంక్ కార్డులను కూడా ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదనంగా, 'మన మిత్ర' వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పించారు
.