
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఒక్కొక్కరిగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యాక్షన్ హీరో విశాల్ తన పాత స్నేహితుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకుంటూ విశాల్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ భేటీ అనంతరం విశాల్ స్పందిస్తూ.. “లయోలా కాలేజీలో మన పరిచయం ఏర్పడిన నాటి నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడూ ‘డార్లింగ్’ అని పిలుస్తూనే ఉన్నాను. ఈరోజు మీరు ఇంత పెద్ద స్థాయికి వచ్చినా నా పిలుపులో ఎలాంటి మార్పు రాలేదు. ఒక సాధారణ హీరోగా కెరీర్ మొదలుపెట్టి..
ఎన్నో అడ్డంకులు, విమర్శలను మీ మౌనంతో, విజయాలతో తిప్పికొట్టారు. ఒక సూపర్‌స్టార్‌గా సినీ రంగాన్ని ఏలి.. ఇప్పుడు తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రిగా అత్యున్నత శిఖరాలకు ఎదిగారు” అంటూ విజయ్ ప్రయాణాన్ని కొనియాడారు. “ఈ రోజు మీ పదవి, హోదా మారినా..
మనుషులను ఆదరించే మీ వ్యక్తిత్వం మాత్రం అస్సలు మారలేదు. మిమ్మల్ని కలవడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఒకప్పుడు మన మధ్య ఉన్న అదే ఆప్యాయతను మళ్లీ అనుభూతి చెందాను. ఎంజీఆర్ గారి నుంచి జయలలిత అమ్మ వరకు.. స్టాలిన్ అంకుల్ నుండి నా ప్రియ సోదరుడు ఉదయనిధి స్టాలిన్ వరకు ఎందరో ముఖ్యమంత్రులను చూశాం.
కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ‘డార్లింగ్’ అని పిలవడం నాకు ఎంతో ముచ్చటగా, గర్వంగా అనిపించింది. ఈ మధుర క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి” అని విశాల్ ఎమోషనల్ అయ్యారు
.