
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో మన మార్కెట్లో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. ముడి చమురు ధరలు దిగి రావడం; ద్రవ్యోల్బణం, వృద్ధి భయాలు తగ్గుముఖం పట్టడమూ మార్కెట్‌కు కలిసొచ్చింది.
ముఖ్యంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ రాణించగా.. మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ 24 వేల మార్కుకు కాస్త దూరంలో నిలిచింది. సెన్సెక్స్ ఉదయం 76,526.77 (క్రితం ముగింపు 76,264.33) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది.
రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,846.74 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 544.15 పాయింట్ల లాభంతో 76,808.48 వద్ద ముగిసింది. నిఫ్టీ 135.25 పాయింట్ల లాభంతో 23,989.15 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 94.55గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్ షేర్లు రాణించాయి. ఇండిగో, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బీఈఎల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81 డాలర్లకు దిగి రాగా.. బంగారం ఔన్సు 4343 డాలర్ల వద్ద కొనసాగుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.