
ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రాఖ్’ (Raakh Webseries). ‘మీర్జాపూర్’ ఫేమ్ అలీ ఫజల్ ప్రధాన పాత్ర పోషించారు. సోనాలీ బింద్రే, ఆమిర్ బషీర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘పాతాళ్‌లోక్’తో థ్రిల్ చేసిన ప్రొసిత్ రాయ్ (Paatal Lok Director) ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
అమెజాన్ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఎలాంటి థ్రిల్ పంచింది? ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ అశోక్ అరోడా (ఆమిర్ బషీర్), మోనా అరోడా (సోనాలి బింద్రే) దంపతులకు ఇద్దరు పిల్లలు. సుమన్ అరోడా (దివ్య శర్మ), సాహిల్ అరోడా (వివన్ శర్మ) దిల్లీలోని ఓ స్కూల్లో చదువుతూ ఉంటారు.
రేడియో స్టేషన్లో పాట పాడేందుకు ఇంటి నుంచి వెళ్లిన అక్కాతముళ్లు కనిపించకుండాపోతారు. దీంతో ఎస్సై జయప్రకాశ్ జాదవ్ (అలీ ఫజల్) విచారణ మొదలు పెడతాడు. ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేస్తారు. ఆవారాగా తిరిగే బాబు (ఆకాశ్ మఖీజా), రజ్జో(రమణ్‌దీప్ యాదవ్)లు ఈ దారుణానికి ఒడిగడతారు.
ఈ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి? బాబు, రజ్జోల గతం ఎలాంటిది? ఎందుకు నేరస్థులుగా మారారనేది తెలియాలంటే వెబ్‌సిరీస్ చూడాల్సిందే! కొన్నేళ్ల కిందట జరిగిన నిర్భయ ఘటన మొదలుకొని చరిత్ర పుటల్నివెనక్కి తిరగేస్తూ వెళ్తే ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే హత్యోదంతాలు మన కళ్ల ముందు కనపడుతూ ఉంటాయి.
అందరికీ ఇదొక నేర చర్యగా పైకి అనిపించినా, ఆధునిక మానవుడిలో మేల్కొని ఉన్న మృగం తాలూకూ రక్తదాహం కనిపిస్తుంది. 1978లో రంగా- బిల్లా కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఆ కేసు విచారణ, ఈ సందర్భంగా వెలుగు చూసిన నిజాలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించాయి.
ఆ వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ప్రొసిత్ రాయ్ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ‘రాఖ్’ వెబ్‌సిరీస్‌ను తీర్చిదిద్దడంలో ఫర్వాలేదనిపించారు. పిల్లల కిడ్నాప్, హత్యతో
మొదటి ఎపిసోడ్‌లోనే చూపించి, అసలు కథను పట్టాలెక్కించాడు దర్శకుడు. అక్కడి నుంచి సాగే ఇన్వెస్టిగేషన్ సాధారణంగానే ఉంటుంది. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇలాంటి కేసుల విచారణకు పోలీసులు అనుసరించిన మార్గం ఏంటి? అప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చిన ఫోరెన్సిక్ విభాగం సహాయంతో కేసు విచారణలో ఎలాంటి పురోగతి సాధించారు? ఆధారాలను సేకరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఇలాంటి ఎన్నో చిన్న చిన్న విషయాలను దర్శకుడు ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా 70వ దశకం నాటి పరిస్థితులను కళ్లకు కట్టారు. 8 ఎపిసోడ్ల సుదీర్ఘ వెబ్‌సిరీస్ చాలా వరకూ నెమ్మదిగానే సాగుతుంది. నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఎపిసోడ్‌నూ గతంతో ముడిపెడుతూ తీర్చిదిద్దారు.
ఒక్కో ఆధారాన్ని వెతుక్కుంటూ ఎస్సై జయప్రకాశ్ ఈ కేసులో ముందుకు వెళ్తుంటే, పోలీసులకు చిక్కకుండా బాబు, రజ్జో తప్పించుకుని తిరుగుతుండటం తదితర సన్నివేశాలు సుదీర్ఘంగా ఉంటాయి. చివరి రెండు ఎపిసోడ్ల వరకూ ఈ టామ్ అండ్ జెర్రీ ఆట కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో చాలా విషయాలను దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. బాబు, రజ్జోలు చేసే దారుణాలు, వారి మనస్తత్వం, వార్తా పత్రికలు ఆ న్యూస్ కవరేజ్ చేసే విధానం, ఇలా చాలా విషయాలను చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సిరీస్ నిడివి పెరిగిపోయింది. చివరి రెండు ఎపిసోడ్లలో బాబు, రజ్జో అసలు గతం, పోలీసులు వాళ్ల కోసం సాగించే వేట ఇలా వరుస సన్నివేశాలతో సిరీస్ పరుగులు పెడుతుంది. పతాక సన్నివేశాలు గుండెలను బరువెక్కిస్తాయి. అదే సమయంలో ఇటు తల్లిదండ్రులు, అటు పిల్లలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తాయి. ఒకవేళ బాబు, రజ్జోలకు సాహిల్, సుమన్ దొరక్కుండా ఉంటే ఏం జరిగేదో చూపిస్తూ సిరీస్‌ను ముగించిన తీరు హృద్యంగా ఉంటుంది.
ఎస్సై జయప్రకాశ్ జాదవ్‌గా అలీ ఫజల్ ఆ పాత్రలో ఒదిగిపోయారు. పోలీస్ ఆఫీసర్‌గా ఆయన ఆహార్యం, నటన చాలా సటిల్డ్‌గా ఉంటుంది. ఈ సిరీస్‌కు బాబుగా నటించిన ఆకాశ్ మఖీజా, రజ్జోగా రమణ్‌దీప్ యాదవ్‌లు ప్రాణం పోశారు. క్రూరత్వం, అమాయకత్వం, తెగింపు ఇలా ఎన్నో భావాలను కళ్లతోనే పలికించారు. మరీ ముఖ్యంగా చిన్నారులను హత్య చేసే సన్నివేశం చూస్తే, వారిపై ప్రతి ప్రేక్షకుడికి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. సోనాలి బింద్రే సహా మిగిలిన వాళ్లు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. నిడివి ఒక్కటే సమస్య. 8 ఎపిసోడ్ల సిరీస్ సుదీర్ఘంగా సాగుతుంది. ఒక్కో ఎపిసోడ్ 45 నిమిషాలపైనే ఉంది. ‘పాతాళ్ లోక్’వంటి సిరీస్‌తో మెప్పించిన ప్రొసిత్రాయ్ ‘రాఖ్’ విషయంలోనూ తనముద్ర బలంగా చూపించాడు. ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ కాస్త తగ్గించి ఉంటే సిరీస్ మరింత అలరించేది. ‘నాయకుడు కావాలంటే శక్తి కండల్లో కాదు.. ఆలోచనల్లో ఉండాలి. అప్పుడే సామాన్యుడి నుంచి హీరో అవుతాడు. అలా జరగాలంటే కష్టపడి చదువుకోవాలి’, ‘నిజమైన పోరాటం అంటే నమ్మకాన్ని వదిలి పెట్టకుండా ఉండటం’ వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి.
కుటుంబంతో చూడొచ్చా?: కష్టమే..! అసభ్య సన్నివేశాలు లేకపోయినా, తెలుగులో అసభ్య పదాలు, బూతులు యథేచ్ఛగా వాడేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.