.webp&w=3840&q=75)
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నా.. భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి రేటులో దూసుకుపోతుంది. తాజాగా భారత జీడీపీ రేటు 7.7 శాతంగా నమోదైంది. దీంతో భారత్ ఆర్థికంగా బలంగా ఉన్నట్లు తేలింది. ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ భవిష్యత్ పాత్రపై కీలక అంచనాలు వెలువడ్డాయి.
2060 నాటికి కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ప్రాతిపదికన ప్రపంచ జీడీపీలో భారత వాటా చైనాను అధిగమించనున్నట్లు ప్రముఖ పరిశోధనా సంస్థ వరల్డ్ ఇనిక్వాలిటీ ల్యాబ్ (WIL) నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం చైనా ప్రపంచ జీడీపీలో సుమారు 20 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ, జనాభా తగ్గుదల ప్రభావంతో 21వ శతాబ్దం రెండోర్థంలో ఆ దేశ ఆర్థిక ప్రాధాన్యం క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు రూపొందించిన ‘గ్లోబల్ జస్టిస్ రిపోర్ట్: ఏ ప్లాన్ ఫర్ ఈక్వాలిటీ అండ్ ప్రాస్పెరిటీ విత్ ప్లానెటరీ బౌండరీస్’ నివేదికలో ఈ అంశాలను వెల్లడించారు. దాని ప్రకారం 1945లో ప్రపంచ జనాభాలో చైనా వాటా 23 శాతం ఉండగా..
2025 నాటికి అది 17 శాతానికి పడిపోయింది. 2100 నాటికి ఇది 8 శాతం కంటే తక్కువకు చేరే అవకాశం ఉంది. జనాభా తగ్గుదల కారణంగా చైనా ప్రపంచ జీడీపీలో వాటా మొదట స్థిరపడిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. 2060 ప్రాంతంలో భారత్ దానిని అధిగమించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
భారత్ జనాభా, వినియోగ మార్కెట్, ఆర్థిక విస్తరణ, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు దీర్ఘకాలంలో దేశానికి అనుకూలంగా మారనున్నాయి. అయితే చైనాతో పోలిస్తే భారత్‌లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, ఉత్పాదకత వృద్ధి మాత్రం తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.
చైనాలో మానవ వనరుల అభివృద్ధి, విద్య, నైపుణ్యాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందిందని విశ్లేషించింది. 21వ శతాబ్దంలో
ప్రపంచం ఒకే దేశ ఆధిపత్యంలో కాకుండా బహుళ ధృవ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని నివేదిక అంచనా వేసింది. 1950లలో అమెరికా ప్రపంచ జీడీపీలో 35-40 శాతం వాటాతో ఆధిపత్యం చెలాయించగా.. 1900-1910 మధ్య యూరప్ వాటా 40-45 శాతం వరకు ఉండేది. అయితే చైనా ఎప్పటికీ ఆ స్థాయి ఆధిపత్యాన్ని సాధించే అవకాశం చాలా తక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది.
ప్రపంచ ఆర్థిక దృక్పథం (WEO) తాజా అంచనాల ప్రకారం అమెరికా జీడీపీ: 32.38 ట్రిలియన్ డాలర్లు; చైనా జీడీపీ: 20.85 ట్రిలియన్ డాలర్లు; భారత్ జీడీపీ: 4.15 ట్రిలియన్ డాలర్లు; యూకే జీడీపీ: 4.27 ట్రిలియన్ డాలర్లు; జపాన్ జీడీపీ: 4.38 ట్రిలియన్ డాలర్లు. అంటే 2025లో 3.92 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత జీడీపీ, 2026లో 4.15 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేస్తున్నారు.
కొనుగోలు శక్తి సమానత్వం (PPP) అనేది ఒక దేశ కరెన్సీతో కొనుగోలు చేయగల వస్తువులు, సేవల పరిమాణాన్ని మరో దేశ కరెన్సీతో పోల్చే ప్రమాణం. సాధారణ జీడీపీ కంటే దేశ ప్రజల వాస్తవ కొనుగోలు శక్తిని అంచనా వేయడానికి PPPను ఉపయోగిస్తారు. ఈ ప్రకారంగా భారత్ 2060 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగి చైనాను అధిగమించే అవకాశం ఉందన్న ఈ అంచనా దేశ ఆర్థిక భవిష్యత్‌పై ఆశావహ సంకేతాలను ఇస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ భారత్‌కు సంబంధించి చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చిన చర్చల్లో అసలు కేంద్రబిందువు ఒకటే. ప్రపంచ ఆర్థిక శక్తి ఇప్పుడు పశ్చిమం నుంచి ఆసియాకు, ముఖ్యంగా భారత్, చైనాల సెంట్రిక్‌గా మారుతోంది. 2026లో ప్రపంచ వాస్తవ జీడీపీ వృద్ధికి అత్యధికంగా దోహదపడే దేశంగా చైనా, తర్వాత భారత్ ఉన్నాయని IMF వెల్లడించింది. భారత్ వాటా 17%, చైనా వాటా 26.6%గా వెల్లడైంది. అదే డేటాను ఉటంకిస్తూ మస్క్ ‘ద బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఈజ్ చేంజింగ్’అని వ్యాఖ్యానించారు. IMF ప్రకారం భారత్ 2026లో 6.4% చొప్పున ఎదగవచ్చని, చైనా 4.5%కి దిగొచ్చే అవకాశం ఉందని జనవరి 2026 అప్డేట్ చెబుతోంది.
గత శతాబ్దంలో ప్రపంచ ఆర్థిక కేంద్రం మేజారిటీగా అమెరికా , ఐరోపా చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు అది మారుతోంది. కారణం కేవలం మార్కెట్లు కాదు. జనాభా , పని చేయగలిగే యువత, విద్య, పెట్టుబడి, తయారీ సామర్థ్యం. ఆ ప్రాతిపదికనే చైనా ఎదుగుదల వేగంగా జరిగింది. అయితే చైనాలో తగ్గుతున్న జనాభా ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెంచుతోంది.
భారత్ మాత్రం “డెమోగ్రాఫిక్ డివిడెండ్” అనే అవకాశాన్ని ఇంకా పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంది. IMF వర్కింగ్ పేపర్ ప్రకారం భారత్‌లో గణనీయ జనాభా వయస్సు GDP వృద్ధికి గణనీయంగా సహకరిస్తాయంటున్నారు.
2025 ఏప్రిల్‌లో IMF, భారత్ 2025లో 6.2% మరియు 2026లో 6.3% వృద్ధి సాధించవచ్చని తెలిపింది; అదే విడుదలలో ప్రపంచ వృద్ధి 2.8%–3.0% మధ్యే ఉండనుందని పేర్కొంది. 2026 జనవరి అప్డేట్లో భారత్ 2025కి 7.3%, 2026కి 6.4%గా, చైనా 2026కి 4.5%గా అంచనా వేసింది.
అదే సమయంలో సోషల్ మీడియాలో వ్యాపించిన IMF-ఆధారిత గ్రాఫ్‌ను మస్క్ పంచుకోవడంతో ఈ విషయం మరింత వైరల్ అయింది. 2026 ఫిబ్రవరిలో భారత ఆర్థికమంత్రి కూడా ఈ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ, భారత్ ప్రపంచ వృద్ధిలో కీలక స్థానం దక్కించుకుందని చెప్పారు. 2026 ఏప్రిల్ IMF అప్డేట్లో ప్రపంచ వృద్ధి 3.1%కి తగ్గడంతో, భూభౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అడ్డంకులు, మరియు విధాన అనిశ్చితి ఎంత బలంగా కొనసాగుతున్నాయో మరోసారి స్పష్టమైంది.
IMF అంచనాలు దేశాల అంతర్గత చట్టవ్యవస్థను మార్చలేవు. కానీ వాణిజ్య నియమాలు, సుంకాలు, పెట్టుబడి వాతావరణం, కాపిటల్ ఫ్లో నిర్వహణ, స్వతంత్ర ఆర్థిక సంస్థల విశ్వసనీయతపై ఒత్తిడిని చూపుతాయి.
జనవరి 2026 IMF అప్డేట్లో విధాన అనిశ్చితి, వాణిజ్య ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంక్ స్వతంత్రత వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అంటే ఆర్థిక భవిష్యత్తు కేవలం జనాభా వల్లే కాదు; పాలన, నియంత్రణ, న్యాయ–విధాన స్థిరత్వం ద్వారా నిర్ణయిస్తారు.
మస్క్ వ్యాఖ్యలు ఆర్థిక విశ్లేషణగా మొదలైనా, అవి రాజకీయ కోణం తీసుకుంటున్నాయి. ఒకవైపు ఇది అమెరికాకు హెచ్చరికగా, మరోవైపు భారత్‌కు ప్రోత్సాహంగా మారింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లు, భారత ప్రస్థానం అమెరికా స్ట్రాటజీ ద్వారా కాదు, భారత స్వీయ బలాబలాల ద్వారానే నిర్ణయించబడుతుంది. అది జాతీయ స్వాతంత్ర్య భావనను బలపరుస్తుంది . భారత్‌కు ఉన్న ప్రధాన బలం యువ జనాభా. కానీ అదే యువ జనాభాకు విద్య, ఆరోగ్యం, నైపుణ్యాలు, ఉపాధి కల్పన లేకపోతే అది డివిడెండ్ కాకుండా భారంగా మారుతుంది. IMF ప్రకారం భారత్‌లో ఉత్పాదకత వృద్ధి, అసమానతలు, మానవ మూలధన పెట్టుబడి వంటి సమస్యలు పరిష్కారం కావాలి; లేకపోతే GDP పెరుగుదల ఉన్నా సామాజిక ఫలితం పరిమితంగా ఉండొచ్చు.
మస్క్ TFR 1.9 అని ప్రస్తావించడం కూడా ఈ చర్చను జనాభా శాస్త్ర దిశగా మళ్లించింది. కానీ ఒక దేశంలో తక్కువ సంతానోత్పత్తి రేటు మాత్రమే నిర్ణాయకం కాదు. మహిళా విద్య, ఉద్యోగ పాల్గొనడం, ఆరోగ్య వ్యవస్థ, నగరీకరణ, మరియు గృహ ఖర్చులు వంటి అంశాలు కూడా దీన్ని ప్రభావితం చేస్తాయి. ఆర్థికవృద్దికి సంబంధించినఅసలు డేటా IMFదే, కానీ సోషల్ మీడియా దాన్ని వైరల్ ఫ్రేమ్ కల్పిస్తోంది. పలు వార్తా సంస్థలు “ఇండియా ఎహెడ్ ఆఫ్ ద యూఎస్”, “బాలెన్స్ ఆఫ్ పవర్ ఛేజింగ్” వంటి ఆకర్షణీయమైన శీర్షికలతో కథనాలు వెలువరించాయి. ఇక్కడ ప్రమాదం ఏంటంటే, IMF అంచనాలు స్థిరసత్యాలు కావు. అవి మారుతూ ఉంటాయి. జనవరి 2026 అప్డేట్, ఏప్రిల్ 2026 అప్డేట్ మధ్యనే ప్రపంచ వృద్ధి 3.3% నుంచి 3.1%కి తగ్గింది. మీడియా ఈ అస్థిరతను కూడా ఫోకస్ చేయకపోతే అపోహలు తప్పవంటున్నారు.
ఈ అంచనాలన్నీ భారత్‌ను మరింత అప్రమత్తం చేసేవే. అవకాశం ఉంది, కానీ ఆటోమేటిక్ విజయం దక్కదు. విద్య, ఆరోగ్యం, యువత, మహిళల భాగస్వామ్యం, ఉత్పత్తుల తయారీ, కూలీ ఉత్పాదకత, సంస్థాగత సంస్కరణలు లేకుండా జనాభా ఉన్నా ప్రయోజనం ఉండదు. చైనా విషయంలో, జనాభా క్షీణత, వృద్ధాప్యం, నిర్మాణాత్మక మందగమనం దాని 21వ శతాబ్దపు రెండోఆర్థంలో పట్టు తగ్గిస్తాయన్న అంచనా బలంగా కనిపిస్తోంది. అయినప్పటికీ, చైనా ఇప్పటికీ వాస్తవ వృద్ధికి అతిపెద్ద దోహదదారుగా ఉంది. కాబట్టి “చైనా క్షీణించింది” అని చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద, 21వ శతాబ్దం బహుధృవ ఆర్థిక యుగంగా మారుతోంది; ఒకే దేశ ఆధిపత్యం కొనసాగడం అసాధ్యమని IMF నివేదికలు సూచిస్తున్నాయి.
సూటిగా చెప్పాలంటే, భారత్‌కు 2060 నాటికి చైనాను అధిగమించే అవకాశం ఉంది. కానీ అది ఖచ్చితంగా కాదు, షరతులతో మాత్రమే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జనాభా ప్రయోజనాలు, విధాన సంస్కరణలు, ఉత్పాదకత పెరుగుదల, మానవ మూలధన పెట్టుబడి కలిసి నడిస్తేనే అది సాకారమవుతుంది. అందుకే మస్క్ ఆర్థిక శక్తి ఇక ఒకే దేశం చేతిలో ఉండబోదని, ఆసియా ఈ శతాబ్దపు ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా నిలవబోతోందని అమెరికాను హెచ్చరించారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ పురోగతికి అవరోధాలు ఏంటి?
.