సేవ్ ది టైగర్స్ గత రెండు సీజన్లు చూసిన తరువాత.. ఎవరి గురించి మాట్లాడుకున్నా మాట్లాడకపోకున్నా.. ప్రియదర్శి, జోర్దార్ సుజాతల గురించి అయితే తప్పకుండా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆయా పాత్రల్లో అంతలా ఒదిగిపోయారు వాళ్లిద్దరూ. తెలంగాణ యాస, భాషల్ని అలవోకగా పలికించిన ఈ అచ్చ తెలుగు తెలంగాణ జంట స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు.
అయితే వీళ్లిద్దరూ కలిసి సేవ్ ది టైగర్స్లోనే కాదు.. అంతకు ముందు ‘మల్లేశం’ సినిమాలో కూడా నటించాల్సి ఉందంట. నాకు సినిమాలు వద్దురా బాబూ.. సుబ్బరంగా టీవీ వార్తలు చదువుకుంటా.. జర్నలిస్ట్‌గానే ఉంటానని జోర్దార్ సుజాత అంటే.. లేదు లేదు..
నువ్వు నా బిడ్డ లాంటి దానివి.. నాకు నిజంగా బిడ్డే ఉంటే.. ఈ సినిమాలో పాత్రని ఆమెతోనే చేయించేదాన్ని. ఆమె లేదు కాబట్టి నువ్వే చేయాలని పట్టుపట్టాడట ‘మల్లేశం’ చిత్ర దర్శకుడు. కూతురు లాంటిదానివని సెంటిమెంట్‌తో కొట్టడంతో సరే అనేసిందట జోర్దార్ సుజాత.
రెండే రెండు రోజుల్లో నీకు కాల్ చేస్తాం.. క్యాస్ట్యూమ్స్ కూడా రప్పిస్తాం అని చెప్పిన దర్శకుడు.. రెండు రోజులైనా కూడా చడీచప్పుడు లేకపోవడంతో జోర్దార్ సుజాతనే తిరిగి ఫోన్ చేసేసరికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారట. అదేంటీ.. అసలు సుజాత మల్లేశం సినిమా గురించి ఏం చెప్పిందో చూసేయండి.
‘‘నాకు సినిమాలంటే పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు.. సేవ్ ద టైగర్స్‌కి కూడా అనుకోకుండానే వెళ్లాను. నా బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం చూసి మాకు సేమ్ టు సేమ్ ఇలాంటి క్యారెక్టరే కావాలని అడిగారు. ప్రియదర్శి హీరోగా మల్లేశం సినిమా వచ్చింది.
ఆ సినిమా డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి అని అన్నారు. లేదన్నా నేను జర్నలిజంలోనే ఉన్నా.. అదే కెరియర్ అనుకున్నా.. మళ్లీ సినిమాలంటే డైవర్ట్ అవుతుంది.. చేయలేను అని చెప్పాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. నా ఇంట్లో
నీఅంత బిడ్డ ఉంటే.. ఆ క్యారెక్టర్ నా బిడ్డతోనే చేయించుకునేదాన్ని. అంత మంచి కాన్సెప్ట్ అని చెప్పారు. నాకు ఆయన అలా సెంటిమెంట్‌తో మాట్లాడటం నచ్చేసింది. నన్ను ఎవరైనా అక్కా చెల్లి అని అన్నారంటే అక్కడే మెల్ట్ అయిపోతా. రిలేషన్స్ బాండింగ్స్ అనేవి నాకు అంత మంచిగా అనిపిస్తాయి. అందుకే ఆయన అలా అనేసరికి ఓకే అన్నాను. రెండు రోజుల్లో కాల్ చేస్తాం.. నీ క్యాస్ట్యూమ్స్ కూడా రప్పిస్తాం అని అన్నారు. దర్శి, నేను హీరో హీరోయిన్లుగా మల్లేశం సినిమా చేయాల్సి ఉంది. ఆ తరువాత అనన్య నాగల్ల హీరోయిన్గా వచ్చేసింది. రెంజు రోజులు అయిపోయింది.. కాల్ రావడం లేదని నేను తిరిగి చేశాను. సారీ అమ్మా.. ఆల్రెడీ ఇంకో అమ్మాయిని తీసుకున్నాం అని అన్నారు. అప్పుడు నా హృదయం చాలా బాధపడింది. అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయాను. మీ అంతట మీరే వచ్చారు.. నాకు ఒక్క మాట చెప్తే బావుండేది అని చాలా బాధపడ్డాను. వామ్మో సినిమాలంటే ఇలా ఉంటాయా? వద్దులే.. ఉన్నదాంట్లోనే హ్యాపీగా ఉందాం అనుకున్నా. అందుకే ఇంక సినిమాలకు ట్రై చేయలేదు. కానీ సేవ్ ది టైగర్స్ సినిమా వెంటపడి మరీ చేయించారు. లక్కీగా కలిసి వచ్చింది. పెళ్లి తరువాత గ్యాప్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు చేయడానికి రెడీ. సినిమాల పట్ల నాకు జీరో నాలెడ్జ్. కానీ ఒక బిడ్డకి తల్లి జాగ్రత్తలు చెప్పి ఎలా పంపిస్తుందో.. నాకు నా భర్త రాకేష్ కూడా అలాగే చెప్పి పంపిస్తాడు. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి? ఏం చేయాలి? ఏ క్యారెక్టర్ ఎలా చేయాలో అన్నీ చెప్తాడు. నా గైడెన్స్ మొత్తం ఆయనే. ఓనమాలు నేర్పింది మా ఆయనే. తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాల్లో తెలంగాణ ఆర్టిస్ట్‌లు ఉండటం లేదనే బాధ ఎవరికైనా ఉంటుంది.. వేరే చోట నుంచి తీసుకొచ్చి మన తెలంగాణ క్యారెక్టర్స్ ఇవ్వడం అనేది ఇక్కడున్న ఆర్టిస్ట్‌లకు బాధాకరమే. ఎందుకంటే మన భాష అయినప్పుడు వాళ్లకంటే మనమే బాగా చేస్తాం కదా అని ఎవరికైనా ఉంటుంది. నాకు ఇండస్ట్రీ గురించి అంతగా తెలియదు కానీ.. మన వాళ్లకి ఆఫర్లు ఇస్తే బావుండనిపిస్తుంది’ అంటూ తెలంగాణ వాదం వినిపించింది జోర్దార్ సుజాత.