
మన శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి నీరు చాలా అవసరం. కానీ ఎంత నీరు తాగుతున్నామన్నదే కాదు, ఎప్పుడు తాగుతున్నాం? ఎలా తాగుతున్నాం? ఎంత గ్యాప్ తో తాగుతున్నాం? అనే విషయాలు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.
మరి నీటిని ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. రాత్రంతా నిద్రలో ఉంటాము కాబట్టి.. శరీరం కొన్ని గంటల పాటు నీరు తీసుకోకుండా ఉంటుంది.
ఈ సమయంలో డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తాగడం ద్వారా శరీరం మళ్లీ చురుకుగా మారుతుంది. చాలామంది చల్లటి నీళ్లు లేదా వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ నార్మల్ వాటర్ తాగడం మంచిది.
బాగా చల్లటి నీళ్లు తాగడం వల్ల కొందరిలో గొంతు సమస్యలు, జీర్ణక్రియలో ఇబ్బందులు రావచ్చు. అలాగే బాగా వేడి నీరు కూడా అందరికీ అనుకూలం కాకపోవచ్చు. అంతేకాదు రోజుకు అవసరమైన నీటిని ఒకేసారి ఎక్కువగా తాగేయకుండా రోజు మొత్తం కొద్దికొద్దిగా తాగడం మంచిది.
రెండు లేదా మూడు గంటలకు ఒకసారి ఒక గ్లాస్ నీరు తాగడం ద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చాలామంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. కానీ గ్యాప్ తీసుకుంటూ కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా కొందరు నిలబడి లేదా హడావిడిగా ఒకేసారి గ్లాస్ నీటిని తాగేస్తుంటారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం సాధ్యమైనంత వరకు కూర్చొని, నిదానంగా నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరం నీటిని సులభంగా గ్రహిస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసిన వెంటనే నీటిని మెల్లగా తాగడం మంచిది. రోజుకు ఎంత నీరు తాగాలి అనేది వయసు, బరువు, వాతావరణం, శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి
ఉంటుంది. సాధారణంగా పెద్దవాళ్లు రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు నీరు తీసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు, వ్యాయామం చేసినప్పుడు లేదా చెమట ఎక్కువగా వచ్చినప్పుడు నీటి అవసరం కూడా పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో అదనంగా నీరు తాగడం శరీరానికి మేలు చేస్తుంది.