దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూర్చారు.
జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పలువురు సెలబ్రిటీలు ఈ సినిమాని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. తాజాగా ఈ చిత్రంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురించించారు.‘సింగ్ గీతం’ సినిమా చూసిన ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
చిత్ర బృందాన్ని అభినందిస్తూ పోటీ పెట్టారు. ఇది హృదయాన్ని తాకే అద్భుతమైన సినిమా అని పేర్కొన్న తారక్.. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు సృజనాత్మకత, కథల పట్ల ఉన్న తపన, ఆలోచనా విధానం తనను ఆశ్చర్యపరిచాయని అన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించిన నాగ్ అశ్విన్‌ను ఎన్టీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
నాలుగు దశాబ్దాలుగా సింగీతం డ్రీమ్ గా ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఆయనకు ఈ సినిమా అందమైన నివాళిగా నిలిచిందన్నారు.దేవిశ్రీ ప్రసాద్ పనితీరును ఎన్టీఆర్ ప్రశంసించారు. డీఎస్పీ అందించిన సంగీతం సినిమాలోని భావోద్వేగాలను ప్రేక్షకుల హృదయాలకు చేరవేసి, కథకి బలాన్ని ఇచ్చిందన్నారు.
అలాగే మూవీ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అనుసరించిన వినూత్న విధానం తనను ఎంతో ఆకట్టుకుందని తారక్ పేర్కొన్నారు. మామూలుగా అందరూ సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తే, ఇక్కడ సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్‌ను లాంచ్ చేయడం తనని సర్పైజ్ చేసిందన్నారు.
ఈ సందర్భంగా ‘సింగ్ గీతం’ ట్రైలర్ ను ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.''సింగ్ గీతం' నా హృదయానికి హత్తుకున్న ఒక అద్భుతమైన చిత్రం. 94 ఏళ్ల వయసులోనూ లెజండరీ సింగీతం శ్రీనివాసరావు గారు తనదైన శైలిలో సృజనాత్మకతను
, జ్ఞానాన్ని ప్రదర్శించడం ఎంతో స్ఫూర్తిదాయకం. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ప్రతి సన్నివేశంలోనూ ఒక మ్యాజిక్‌ను సృష్టించారు. ఒక లెజెండ్ యొక్క 40 ఏళ్ల కలను సాకారం చేయడం నిజంగా దేవుడు ఇచ్చిన వరం లాంటిది. సింగీతం గారికి నాగి, వైజయంతీ ఫిలిమ్స్ అద్భుతమైన నివాళి అందించారు. చిత్ర బృందం మొత్తానికి అభినందనలు''''సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరిచినట్లే, సినిమా విడుదలయ్యాక ట్రైలర్‌ను విడుదల చేయడం అనేది నాకు అతిపెద్ద సర్ప్రైజ్. ఈ ట్రైలర్ ని మీ అందరికీ పరిచయం చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. థియేటర్లలో సినిమాను చూసి ఆనందించండి'' అని ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. తారక్ వంటి పాన్ ఇండియా స్టార్ ప్రశంసలు దక్కడంతో ‘సింగ్ గీతం’ చిత్రానికి మరింత బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.‘సింగ్ గీతం’ సినిమాలో ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రలు పోషించారు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్యామియో చేయగా.. హీరోయిన్ నివేదా పేతురాజ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని తెలుస్తోంది.