
బీబీనగర్, జూన్ 15 : బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మాజీ వైస్ ఎంపీపీ గోరుగంటి బాలచందర్ కోరారు. ఈ మేరకు భువనగిరి ఆర్అండ్బి శాఖ ఈఈ సరితారాణికి సోమవారం వినతిపత్రం అందజేశారు.
బీబీనగర్-నాగిరెడ్డిపల్లి ఆర్అండ్బి రహదారిలో చిన్నరావులపల్లి గ్రామ రాస్తా వద్ద ప్రమాదకర మూలమలుపు ఉండడంతో వాహనాలు అధిక వేగంతో దూసుకు వస్తున్నాయని తెలిపారు. దీంతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాలు సైతం నియంత్రణ కోల్పోయి ఇళ్లలోకి దూసుకెళ్లి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ ప్రమాదాల్లో పలువురికి తీవ్ర గాయాలు కాగా, కొందరు మృతి చెందిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పుగా మారిన ఈ సమస్యను అత్యవసరంగా పరిగణించి రాస్తా వద్ద స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని ఆయన కోరారు
.