
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రోస్‌బాక్‌తో ఆయన సమావేశమై ఆంధ్రప్రదేశ్ పట్టణాల సుస్థిర అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.
రాష్ట్రంలో యూఎన్ హాబిటాట్ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రతిపాదించారు.వాతావరణ మార్పుల నుంచి తీరప్రాంత నగరాలను కాపాడేందుకు ఉద్దేశించిన ‘రైజప్’ కార్యక్రమాన్ని ఏపీలో అమలు చేయాలని సీఎం సూచించారు. పట్టణాల్లో మురికివాడల అభివృద్ధికి పార్టిసిపేటరీ స్లమ్ అప్‌గ్రేడింగ్ ప్రోగ్రాం (పీఎస్యూపీ), వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అర్బన్ రాస్తా ఫ్రేమ్‌వర్క్‌ను సంయుక్తంగా అమలు చేయడంపై చర్చించారు.
2028 నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా ఒక టైమ్‌లైన్‌తో కూడిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోవాలని చంద్రబాబు అన్నారు.మున్సిపల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వాల్యూ క్యాప్చర్ ఫైనాన్సింగ్ వంటి పద్ధతుల ద్వారా స్థానిక ఆదాయ వనరులను పెంచడం, అంతర్జాతీయ వాతావరణ నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చేసిన ప్రతిపాదనలపై యూఎన్ హాబిటాట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
ఏపీతో సంపూర్ణ భాగస్వామ్యానికి వారు సుముఖత వ్యక్తం చేశారు
.