
భారత రక్షణ దళ చరిత్రలో మహిళా సాధికారతకు మరో అధ్యాయం తోడైంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎమ్ఏ) నుంచి తొలిసారి తొమ్మిది మంది మహిళా క్యాడెట్లు... శాశ్వత కమిషన్‌కు ఎంపికై, విధులు నిర్వర్తించబోతున్నారు. భారత రక్షణ దళ చరిత్రలో మహిళా సాధికారతకు మరో అధ్యాయం తోడైంది.
ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎమ్ఏ) నుంచి తొలిసారి తొమ్మిది మంది మహిళా క్యాడెట్లు... శాశ్వత కమిషన్‌కు ఎంపికై, విధులు నిర్వర్తించబోతున్నారు. సంబంధిత పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆఫీసర్లను ప్రశంసిస్తూ దీన్నో చారిత్రక మలుపుగా అభివర్ణించారు.
సైన్యంలో మహిళలు ముందునుంచీ ఉన్నారు కదా... దీనికంత ప్రత్యేకత ఏముంది అంటే? తొమ్మిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎమ్ఏ)ది. దెహ్రాదూన్‌లో ఉంది. సమర్థులైన వేలాది మంది అధికారుల్ని సైన్యానికి అందించింది. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దార్ఢ్యం, దేశభక్తి వంటి అంశాల్లో సైనిక అధికారుల్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దుతోంది.
అయితే ఇప్పటివరకు ఈ అకాడమీ నుంచి శాశ్వత కమిషన్ (పీసీ)కు ఒక్క అధికారిణి కూడా ఎంపిక కాలేదు. ప్రవేశ విధానాల్లో పరిమితులే ఇందుకు కారణం. 1992ల నుంచే మహిళలకు సైన్యంలో చేరే అవకాశం కల్పించినా... వాళ్ల ఎంపిక, విధులు షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) వరకే ఉండేవి.
నిర్దిష్ట కాలం తర్వాత మహిళల శక్తి సామర్థ్యాలు, పాల్గొన్న మిషన్లు, అందించిన సేవల ఆధారంగా శాశ్వత కమిషన్‌లోకి తీసుకునేవాళ్లు. కానీ ఈ ఎంపిక అనుకున్నంత సులువుగా జరిగేది కాదు. 2020 వరకు ఇదే పరిస్థితి. పురుషులతో సమానంగా విధుల్లో పోరాడే ధైర్యం, తెగువ ఉన్నా...
గుర్తింపు ఉండేది కాదు. ఈ వివక్షాపూరిత విధానాల్ని ప్రశ్నిస్తూ బబీతా పునియా అనే న్యాయవాది 2003లో దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిలో మహిళల్ని నిరాకరించడానికి కారణాలు, పెన్షన్ సదుపాయాలు, కమాండర్ పదవుల్లో వివక్ష వంటి అంశాల్ని ప్రశ్నిస్తూ...
. దీనికి మద్దతుగా పలువురు మహిళా అధికారిణులూ గళం విప్పారు. దాదాపు ఏడేళ్ల వాదోపవాదాల తర్వాత మహిళలూ శాశ్వత కమిషన్‌కు అర్హులని హైకోర్టు తీర్పునిచ్చింది. కానీ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. మహిళా కమాండర్లను పురుష సైనికులు అంగీకరించడం కష్టమనీ, శారీరక పరిమితులు, సరిహద్దుల్లో కఠినమైన వాతావరణం, సౌకర్యాలు లేకపోవడం, పెళ్లి, ప్రసవం, పిల్లల పెంపకం వంటివి కారణాలుగా చూపించింది. ఇవన్నీ సమానత్వపు హక్కుకు విరుద్ధమని, లింగవివక్షకు ప్రతీకని కేసుని కొట్టేసింది సుప్రీంకోర్టు. 2020 ఫిబ్రవరిలో మహిళలూ శాశ్వత కమిషన్‌లో చేరడానికి అర్హులుగా తీర్పునిచ్చింది.
ఈ తీర్పుని గుర్తుచేస్తూ కుష్ కాల్రా అనే న్యాయవాది నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లోనూ మహిళలకు అవకాశాలు కల్పించాలంటూ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. దీనికి 2021లో సానుకూల తీర్పు రావడంతో ఎన్డీఏలో శిక్షణకు మహిళలకు తలుపులు తెరచుకున్నాయి. అలా 2022లో 17 మంది మహిళలతో మొదటి బ్యాచ్ ప్రారంభమైంది. అక్కడ మూడేళ్ల శిక్షణను పూర్తిచేసుకుని... తొమ్మిది మంది క్యాడెట్లు ఆర్మీని ఎంపిక చేసుకున్నారు. ఐఎమ్ఏలో చేరే అవకాశాన్ని దక్కించుకున్నారు. శారీరక ప్రమాణాలు, పరీక్షలు, శక్తిసామర్థ్యాల్ని అంచనా వేసే విధానాల్లో ఎలాంటి లింగవివక్ష, రాయితీలు లేకుండా పురుషులతో సమానంగా కఠినమైన శిక్షణను అందించింది. దాంతో శాశ్వత కమిషన్‌లో నియమితులైన తొలి మహిళా క్యాడెట్లుగా రికార్డును సృష్టించారు. తమలా సైన్యంలో చేరాలని కలలు కనే అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు.
ఆఫీసర్ క్యాడెట్లమే... లెఫ్టినెంట్ శనన్ ఢాకా
గర్వం, బాధ్యతలతో కూడిన భావన ఇది. సైన్యంలో చేరాలన్నది నా చిన్ననాటి కల. దీన్ని వృత్తిలా కాకుండా బాధ్యతగానే భావించా. ఎన్డీఏ, ఐఎమ్ఏల్లో శిక్షణలో ఉన్నప్పుడు ఎక్కడా మేము మహిళలం, బలహీనులం అన్న భావన కలగనివ్వలేదు. ‘ఆఫీసర్ క్యాడెట్లు’ అనే పిలిచేవాళ్లు. ఉదయం నాలుగింటికే మా శిక్షణ ప్రారంభమయ్యేది. దాదాపు 100 నిమిషాల పాటు రన్నింగ్, పుష్-అప్స్ చేసేవాళ్లం. తర్వాత పరేడ్ డ్రిల్ ప్రాక్టీస్ ఉండేది. ఆయుధాల నిర్వహణ, వ్యూహాత్మక పరీక్షలు, రూట్ మార్చ్‌లు, శారీరక దృఢత్వాన్ని పరీక్షించే అబ్స్టికల్ కోర్సులు అన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్నాం. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు స్వీకరించడం గర్వంగా ఉంది.
దాదాపు 90 ఏళ్లుగా ఎన్డీఏ, ఐఎమ్ఏలు కేవలం పురుషులకే శిక్షణ ఇచ్చాయి. సుప్రీంకోర్డు తీర్పు మా దిశను మార్చింది. చిన్న వయసులోనే దేశానికి సేవ చేసే అవకాశం సంపాదించుకోవడం గర్వంగా ఉంది. ధైర్యానికీ, నాయకత్వానికీ లింగభేదం లేదని నిరూపిస్తాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.
ఇవన్నీ రాజ్యంగం కల్పించిన సమానత్వపు హక్కుకు విరుద్ధమని న్యాయపోరాటం ప్రారంభించారు