
పొరుగు రాష్ట్రమైన కేరళలో మళ్లీ 'నిఫా' వైరస్ కేసులు వెలుగుచూడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ నుంచి తమిళనాడులోకి వైరస్ వ్యాపించకుండా విజయ్ సర్కార్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. చెన్నై/ఊటీ, జూన్ 15: పొరుగు రాష్ట్రమైన కేరళలో మళ్లీ 'నిఫా' వైరస్ (Nipah Virus) కేసులు వెలుగుచూడటంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది.
కేరళ నుంచి తమిళనాడులోకి వైరస్ వ్యాపించకుండా నిరోధించడానికి సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే ప్రాంతాలతో పాటు పర్యాటక ప్రాంతాలైన నీలగిరి (ఊటీ), కోయంబత్తూరు జిల్లాలపై ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది.
తమిళనాడు పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ (DPH) ఆదేశాల ప్రకారం.. కేరళ సరిహద్దుల్లోని వాలామార్, ఉడుమలైపేట, నాడుగాని, తాళూర్, చోలాడి, పాట్టవయల్ సహా 13 కీలక అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను మోహరించింది. చెక్‌పోస్టుల వద్ద 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు.
కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు, పర్యాటకులు, నిత్యం పనుల కోసం సరిహద్దులు దాటే వలస కూలీలకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, వాంతులు వంటి నిఫా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని అధికారులు ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు.
అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించేందుకు సరిహద్దుల్లో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. నీలగిరి జిల్లా కలెక్టర్, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), ప్రైవేట్ క్లినిక్‌లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జ్వరం లేదా 'అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్' (మెదడు వాపు లక్షణాలు) తో వచ్చే రోగుల వివరాలను, వారి ట్రావెల్ హిస్టరీని నిరంతరం గమనించాలని, ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే స్టేట్ సర్వైలెన్స్ విభాగానికి నివేదించాలని స్పష్టం చేశారు
.