Investors Wealth : భారత స్టాక్ మార్కెట్లలో సందడి నెలకొంది. వరుసగా రెండో సెషన్లో సూచీలు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని శుక్రవారం రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా అదే రోజున సెన్సెక్స్ ఏకంగా 1695, నిఫ్టీ 461 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే.
దీంతో మదుపరుల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కూడా రూ. 9.66 లక్షల కోట్లు పెరిగి రూ. 462 లక్షల కోట్లకు చేరుకుంది. ఇప్పుడు సోమవారం సెషన్లో (జూన్ 15) కూడా సూచీలు అదే జోరు కొనసాగిస్తున్నాయి. మంచి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి.ప్రస్తుతం వార్త రాసే సమయంలో జూన్ 15న ఉదయం 9.40 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ దాదాపు 1100 పాయింట్లు పెరిగి 76,650 స్థాయిలో ట్రేడవుతోంది.
మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 350 పాయింట్లు పెరిగి 23970 స్థాయిలో ఉంది. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ 1300 పాయింట్ల వరకు పెరగడం విశేషం. ఇక ప్రస్తుతం ఇన్వెస్టర్ల సంపద మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే రూ.
10 లక్షల కోట్లకుపైగా పెరిగి రూ. 462 లక్షల కోట్ల నుంచి రూ. 472 లక్షల కోట్లకు చేరుకుంది. తాజాగా సూచీలు దూసుకెళ్లేందుకు ప్రధాన కారణం అమెరికా- ఇరాన్ డీల్ కుదరడమే.అవును.. ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా ప్రకటన చేశారు.
ఇందుకు సహకరించిన దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇక హర్ముజ్ జలసంధి ఈ నెల 19న తెరుచుకుంటుందని.. ఎలాంటి సుంకాలు ఉండవన్నారు. చమురు రవాణా జరగనివ్వండని స్పష్టం చేశారు. ఇదే ఒప్పందం గురించి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ట్వీట్ చేశారు.
జూన్ 19న రెండు దేశాల మధ్య స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు ఉంటాయని తెలిపారు.ఈ ప్రకటనల నేపథ్యంలోనే పశ్చిమాసియాలో
శాంతి దిశగా అడుగులు పడుతున్నాయి. క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోవడంతో ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. పలు రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. సెన్సెక్స్ 30 ప్యాక్‌లో దాదాపు అన్నీ లాభాల్లోనే కదలాడుతున్నాయి. అత్యధికంగా ఇండిగో, ఎటర్నల్ (జొమాటో) 4 శాతానికిపైగా పెరగ్గా.. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎల్ అండ్ టీ, ట్రెంట్, మారుతీ సుజుకీ, అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతానికిపైగా పెరిగాయి. ఎంఅండ్ఎం, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి హెవీ వెయిట్ స్టాక్స్ 2 శాతానికిపైగా పెరిగాయి. ఐటీ స్టాక్స్ స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు లుపిన్, సన్ ఫార్మా, సిప్లా వంటి ఫార్మా స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.