దేశంలో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలె ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన సీజేపీ.. తాజాగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సీజేపీ నిరసనలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన యూత్‌ను ఉద్దేశించి ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతదేనని.. తన లాంటి వారు ఎప్పుడూ మార్గనిర్దేశం చేస్తూ.. వెన్నంటి ఉంటారని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే దేశంలో విద్యా వ్యవస్థతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ముఖ్యం అని సోనమ్ వాంగ్‌చుక్ తేల్చి చెప్పారు. రానున్న తరాలకు చదువు ఎంత అవసరమో.. వారు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి.. తాగేందుకు స్వచ్ఛమైన నీరు కూడా అంతే ముఖ్యమని ఆయన గుర్తుచేశారు. ఈ విషయంలో హైదరాబాద్ ప్రజల పోరాటం దేశానికే ఆదర్శమని కొనియాడారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు పరిరక్షణ కోసం చేసిన ప్రచార కార్యక్రమాలు.. భూమి, నదులను కాపాడుకునేందుకు వారు తెగించిన తీరుపై ఆయన అభినందనలు తెలిపారు. అడవులను నరికేసి కాంక్రీట్ బిల్డింగ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తే ప్రజలు సంతోషిస్తారనే తప్పుడు నమ్మకంలో పాలకులు ఉన్నారని.. ఆయన విమర్శించారు. ఈ కాంక్రీట్ జంగిల్స్ పిల్లల భవిష్యత్తును కాపాడలేవని పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అడవులు, నదులను రక్షించేందుకు ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి.. గొంతు విప్పాలని అప్పుడే విజయం సాధ్యం అవుతుందని తెలిపారు. దీర్ఘకాలంలో విద్యను, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే.. ముందుగా ఒక క్రియాశీలక, నిజాయితీగా పనిచేసే ప్రజాస్వామ్యం కావాలని సోనమ్ వాంగ్‌చుక్ ఆకాంక్షించారు.తమకు విద్యా శాఖ మంత్రి అవ్వాలని.. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని.. ఎలాంటి సొంత ప్రయోజనాలు, ఆశలు లేవని సోనమ్ వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. కాక్రోజ్ జనతా పార్టీ అంటే.. అధికారంలోకి
వచ్చేందుకు ఉపయోగపడే రాజకీయ వేదిక కాదని.. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఒక పవిత్రమైన ప్రయత్నమని తెలిపారు. యూత్‌ను చైతన్యపరిచే లక్ష్యంగా సాగుతున్న ఒక స్వచ్ఛమైన ఉద్యమం అని ఆయన అభివర్ణించారు. దేశంలో నిత్యం వేధిస్తున్న ఈ పేపర్ లీకులు, పరీక్షల రద్దు వంటి తీవ్రమైన సమస్యలకు ఇకనైనా ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవస్థలో తప్పు జరిగినపుడు మంత్రి అయినా.. చివరికి ప్రధాని అయినా సరే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. చదువును కేవలం పరీక్షలకు మాత్రమే పరిమితం చేయకుండా.. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది రానున్న తరాల ఫ్యూచర్ కోసం బలమైన పునాది వేయాలని సోనం వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు.