
ఓ వ్యాపారికి నకిలీ బంగారం అంటగట్టి రూ.6 లక్షలతో ఉడాయించిందో జంట. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాంలో చోటుచేసుకుంది. ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్న గురుగుబిల్లి జగదీష్ దుకాణానికి గుర్తుతెలియని జంట తరచూ వచ్చి గాజులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేవారు. దీంతో వారికి పరిచయం పెరిగింది. ఆ జంట.. తమ వద్ద బంగారం ముక్క ఉందని, అవసరాల రీత్యా విక్రయించాలని అనుకుంటున్నామని 20 తులాల బిస్కెట్‌ను చూపించారు. వ్యాపారి అందులో పావు తులం ముక్క కత్తిరించి ఓ నగల దుకాణంలో స్వచ్ఛతను పరీక్షించగా అది మేలిమి అని తేలింది. సాయంత్రం తీసుకుంటానని వ్యాపారి వారిని పంపించేశాడు. మళ్లీ వీరు 8 తులాల వేరే బంగారం ముక్క తీసుకుని వస్తే రూ.6 లక్షలు చెల్లించి తీసుకున్నాడు. దీని నాణ్యత పరిశీలించేందుకు వ్యాపారి, నిందితులు వాహనాలపై బయలుదేరారు. ట్రాఫిక్‌లో వ్యాపారి ముందుకు పోగా ఆ జంట పరారైంది. అనుమానం వచ్చి ఆ 8 తులాల బంగారం ముక్క నాణ్యతను పరీక్షిస్తే నకిలీదని తేలింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్త చదివారా: విడాకుల కోసం ఐదేళ్లు పోరాడి.. మళ్లీ ఒక్కటై
..