సూరజ్ రాకతో కార్తీకదీపం సీరియల్‌కి నిజంగానే నవ వసంతం వచ్చినట్టుగా ఉంది. సాధారణంగా కార్తీకదీపం అంటే కథానాయకుడు కార్తీక్ బాబే. కానీ ఇప్పుడు సూరజ్ రాకతో కథకి ఇద్దరు హీరోలయ్యారు. మొన్నటి వరకూ మన లేడీ విలన్ జోత్స్నని కుట్రలకు అడ్డు కట్ట వేసేది..
ఆమె పొగరు దించేదీ దీపా కార్తీక్‌లు మాత్రమే. కానీ ఇప్పుడు కథలోకి మరో కథానాయకుడు వచ్చాడు. అతనే సూరజ్. కథలో అతనికి ఇస్తున్న ప్రాధాన్యత.. ఎలివేషన్స్ చూస్తుంటే మామూలుగా లేవు. ముఖ్యంగా జోత్స్నని మడతపెట్టేసే సీన్లు ఆడియన్స్‌కి భలే కిక్ ఇస్తున్నాయి.
సాధారణంగా కార్తీకదీపం కథలోకి ఓ కొత్త క్యారెక్టర్ వచ్చిందీ అంటే.. దాని వెనుక చాలానే కథ ఉంటుంది. ఇప్పటి వరకూ ఏ కొత్త క్యారెక్టర్ తీసుకున్నా కూడా అలా వచ్చి ఇలా వెళ్లేది కాదు. వచ్చారంటే అలా కథలో నాటుకునిపోతుంటారు. కథని నడిపిస్తుంటారు.
ఇప్పుడు సూరజ్ పాత్ర కూడా అలాగే ఉండబోతుంది. అయితే సూరజ్ పాత్ర ఇప్పటి వరకూ చూసింది ఓ లెక్క అయితే ముందు ముందు చూడబోయేది మరో లెక్క అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం కథని నడిపిస్తున్న తీరు.. అందులోని సూరజ్ పాత్రను చూస్తుంటే..
చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. అంతేకాదు.. దీప, కార్తీక్‌లతో సూరజ్ చనువుగా ఉండటం.. మన కార్తీక్ బాబు బ్రదర్ బ్రదర్ అంటూ సూరజ్‌తో చాలా క్లోజ్‌గా ఉండి.. జోత్స్నని ముప్పుతిప్పలు పెడుతుంటే కథ యమరంజుగా ఉంది. అయితే ఇప్పుడు సూరజ్‌ని చూస్తుంటే..
కథలో మరో కథానాయకుడిగా కనిపిస్తున్నాడు కానీ.. అసలు కథ వేరే ఉంది. అతను కథానాయకుడు కాదు.. ప్రతినాయకుడు అయ్యే అవకాశం స్పష్ఠంగా కనిపిస్తుంది. అదేంటి? సూరజ్ హీరో కదా.. విలన్ కావడం ఏంటి అంటే..? అదే మరి కథలోని అసలు ట్విస్ట్. సూరజ్ ఏదో దీపకి సాయం చేయడానికో..
లేదంటే జోత్స్నని ముప్పుతిప్పలుపెట్టడానికో వచ్చినోడు కాదు. అతని ఎంట్రీ వెనుక బలమైన కథా నేపథ్యమే
ఉంది. దీపని సీఈఓ చేయడానికో లేదంటే.. జోత్స్నని సీఈవో కాకుండా అడ్డుకోవడానికో సూరజ్ రాలేదు. ఆ కంపెనీని వాళ్ల ఆస్తి మొత్తం లాగేయడానికి వచ్చినోడే సూరజ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు జోత్స్నకి ఐలవ్యూ చెప్పడానికి.. ఆమె వెంటపడటానికీ.. ఒక రైట్ పార్టనర్ కోసం వెతుకుతున్నా సార్.. జంటయ్యే మనిషి దగ్గరలోనే ఉందనిపిస్తుందని జోత్స్న వైపు చూస్తూ శివన్నారాయణతో సూరజ్ చెప్పడానికీ బలమైన కారణమే ఉంది. శివన్నారాయణ ఆస్తిని మొత్తం లాగేయాలి అంటే.. అతని మనవరాలైన జోత్స్నని తన గుప్పెట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి అంటే.. ముందు ఆమెని పెళ్లి పేరుతో లొంగదీసుకోవాలి. దీప, కార్తీక్‌లు అడ్డుపడకుండా ఉండాలంటే.. వాళ్లతో మంచిగా నటిస్తూనే శివన్నారాయణ ఆస్తిని కాజేయాలి అన్నదే సూరజ్ ప్లాన్. పైగా జోత్స్న ప్లాన్ కూడా అదే కాబట్టి.. సూరజ్‌తో ప్రేమలో పడటం, పెళ్లికి సిగ్నల్ ఇవ్వడం త్వరత్వరగానే జరిగిపోతాయి అనడంలో సందేహం లేదు. అసలు ఎవరీ సూరజ్.. ప్రస్తుతానికి అయితే తనకి ఎవరూ లేరని.. మణికొండ పీజీలో ఒంటరిగానే ఉంటున్నానని సూరజ్ అంటున్నాడు కానీ.. అదంతా అతను ఆడే నాటకంలో భాగమే అయ్యి ఉండొచ్చు. మరి అతను ఎవరై ఉండొచ్చు అంటే.. శివన్నారాయణ స్నేహితుడు దక్షిణమూర్తి మనవడు అయ్యి ఉండొచ్చు. తాజాగా అసలు దక్షణమూర్తి ఎవరు? శివన్నారాయణకి ప్రాణ స్నేహితుడుగా ఉన్న దక్షణమూర్తి ఎందుకు బద్ద శత్రువుగా మారాడు? దశరథని ఎందుకు చంపాలనుకున్నాడు? అనే విషయాలన్నీ బయటపట్టాయి. మీరు గమనిస్తే.. సరిగ్గా అదే టైమ్‌లో సూరజ్ ఎంట్రీ ఇచ్చాడు. అంటే ఆ దక్షణమూర్తికి సూరజ్‌కి ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది. కాబట్టి ఎన్నాళ్లగానో శివన్నారాయణపై పగ పట్టిన దక్షణమూర్తి.. తాను చేయలేని పనిని తన మనవడు సూరజ్‌తో చేయిస్తున్నాడా? జోత్స్నని పెళ్లాడిన తరువాత సూరజ్ తన నిజస్వరూపం బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. సూరజ్‌ని పెళ్లాడిన తరువాత.. జోత్స్న, సూరజ్‌లు ఇద్దరూ కలిసి దీప, కార్తీక్‌లపై చేసే పోరాటమే కార్తీకదీపం 2 జరగబోయే కథ, కథనం అయ్యి ఉండొచ్చేమోనని అనిపిస్తుందండోయ్.. చూద్దాం ఏమౌతుందో.