భవిత అనే విద్యార్థిని బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతూ పది పరీక్షల్లో 582 మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది.
అయితే ఇంటర్లో చేరేందుకు సర్టిఫికేట్లు ఇవ్వాలని స్కూలు యాజమాన్యాన్ని సంప్రదించగా.. ఫీజు బకాయి చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని స్కూలు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. స్కూలు ఫీజు కట్టలేక భవిత కుటుంబం నానా ఇబ్బందులు పడుతూ ఉండటాన్ని స్థానికంగా ఉండే ఓ యూట్యూబర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్దకు చేరింది. దీనిపై ఆరా తీసిన మంత్రి తన కార్యాలయం అధికారులను అప్రమత్తం చేశారు. మంత్రి కార్యాలయం ఆరా తీస్తే విద్యార్థిని తల్లిదండ్రులు వెంకన్న, దేవకి వ్యాపారంలో నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న విషయం వెలుగుచూసింది. దీంతో స్కూలు ప్రిన్సిపల్‌తో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. విద్యార్థిని ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుని తన వద్దకు రావాలని ఆదేశించారు. దీంతో సర్టిఫికేట్లతో ప్రిన్సిపల్ మంత్రి క్వార్టర్స్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే భవిత కుటుంబం కూడా అక్కడకు చేరుకోగా.. విద్యార్థిని భవితతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి.. ఆమె కుటుంబం పరిస్థితి తెలిసి చలించిపోయారు. పది పరీక్షల్లో మాత్రమే కాకుండా పాలీసెట్‌లో రాష్ట్రస్థాయిలో 634 ర్యాంక్ సాధించిన సంగతి తెలుసుకుని అభినందించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపల్‌ను మందలించిన మంత్రి కోమటిరెడ్డి.. అక్కడికక్కడే భవిత స్కూల్ ఫీజు 60 వేలు చెల్లించి.. విద్యార్థినికి సర్టిఫికేట్లు అందేలా చూశారు.భవిత ఖర్చుల కోసం మరో 20 వేలు అందించారు. భవిత ఉన్నత చదువులకు అండగా ఉంటానంటూ భరోసా కల్పించారు. ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని సూచించారు. పాలీసెట్ కౌన్సిలింగ్‌కు శుక్రవారమే చివరి రోజు అనే సంగతి తెలుసుకున్న మంత్రి.. వేగంగా చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇక తాను వీడియో చూడకపోతే విద్యార్థిని పరిస్థితి ఏమిటని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సాయం చేసే పరిస్థితుల్లో ఉన్నవారు ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలని సూచించారు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని సర్టిఫికేట్లు ఇప్పించటంతో భవిత కుటుంబసభ్యులు మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.