‘లెనిన్’ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని వాయిదాలు వెంటాడుతున్నాయి. తాజాగా సినిమాని మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ముందుగా ‘లెనిన్’ మూవీని మే 1న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ 'పెద్ది' సినిమా కోసం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత 'పెద్ది' కూడా వాయిదా పడటంతో, లెనిన్ కోసం జూన్ 26వ తేదీకి లాక్ చేశారు. డేట్ మార్క్ చేసుకోమని నాగార్జున స్వయంగా ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. ఇంతలోనే అఖిల్ సినిమా మళ్లీ వాయిదా పడనుందనే రూమర్స్ వినిపించాయి. వర్క్ ఇంకా పెండింగ్ ఉందని, చెప్పిన సమయానికి విడుదల కష్టమనే టాక్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో నాగ్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేశారు.‘లెనిన్’ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ''లెనిన్ టీమ్ ఒక అభ్యర్థనతో నా వద్దకు వచ్చారు. వారు తమ 100 శాతం కృషిని అందించి, సంథింగ్ వెరీ స్పెషల్ మూవీని క్రియేట్ చేయడానికి మరికొంత సమయం అడిగారు. వారి ప్యాషన్, స్పిరిట్ నన్ను సరే అనేలా చేశాయి. మనోడు జూలై 10న వస్తున్నాడు. మళ్ళీ చెబుతున్నాను, మీరు ఒక కొత్త అఖిల్‌ను చూస్తారు. 'లెనిన్' అనుభవం కోసం సిద్ధంగా ఉండండి'' అని నాగ్ పేర్కొన్నారు
.