
బూర్గంపహాడ్, జూన్ 13 : అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్‌పోస్టులో శనివారం చోటుచేసుకుంది. మోరంపల్లిబంజర్‌లో అటవీ తనిఖీ కేంద్రంలో పని చేస్తున్న గార్డు పట్టపగలే నిద్ర పోవడంతో ఈ విషయం కాస్తా బహిర్గతమైంది. చెక్‌పోస్టు పర్యవేక్షణ బాధ్యత చూడాల్సిన ఎఫ్బీఓ అక్కడ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది గార్డును ఉంచి వెళ్లడంతో ఆ వ్యక్తి విధుల సమయంలో నిద్రపోతూ ఆ శాఖ పనితీరును చాటి చెప్పాడు. నిత్యం వందలాది వాహనాలు ఈ చెక్‌పోస్టు మీదుగా వెళ్తున్నా సిబ్బంది సకాలంలో వాటిని తనిఖీ చేయడం లేదనే వాదనలూ లేకపోలేదు. ఇక్కడ పని చేస్తున్న అటవీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పనితీరు చెక్‌పోస్ట్ తనిఖీలో సరిగా లేదనే వాదనలూ లేకపోలేదు. గార్డు 24 గంటలూ విధులు నిర్వహించాల్సి ఉండగా ఇలా పట్టపగలు నిద్ర పోతున్నాడంటే దానికి ఆటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు చెక్‌పోస్టు విధుల విషయంలో ఇక్కడి సిబ్బంది పనితీరును ఆరాతీసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు
.