
యూపీఐ ఖాతాకు ఎవరైనా డబ్బులు పంపితే జాగ్రత్త యూపీఐ అలర్టులను రెగ్యులర్ చెక్ చేస్తూ ఉండండి ఇలాంటి మోసాల పట్ల ఎలా సేఫ్‌గా ఉండాలంటే? PhonePe Fraud : ఆన్లైన్ మోసాలతో జర జాగ్రత్త.. ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్లు వినియోగదారులను మోసగించేందుకు కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. రోజువారీ లావాదేవీలు గతంలో కన్నా చాలా సింపుల్ అయిపోయాయి. డిజిటల్ పేమెంట్లతో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి మీ ఫోన్‌పే లేదా యూపీఐ ఖాతాకు డబ్బులు పంపుతానని నమ్మిస్తాడు. ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే.. ఫ్రాడ్ మనీని మీ ఖాతాలో పంపేందుకు సైబర్ నేరగాళ్లు ఇలా చేస్తుంటారు. అది నిజమని మీరు నమ్మి మీ ఖాతాలోకి డబ్బులు పంపేందుకు అనుమతిస్తే అంతే సంగతులు.. మీకు తెలియకుండానే మీరు సైబర్ క్రైమ్ లోకి చిక్కుకోవచ్చు. ఫలితంగా మీ బ్యాంకు ఖాతా కూడా ఫ్రీజ్ చేయొచ్చు. ఇంతకీ ఇలాంటి మోసాల నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఫ్రాడ్ మనీ ఎలా పంపుతారంటే? : సాధారణంగా ఇలాంటి మోసాలు ఎక్కువగా తెలియనవారితోనే జరుగుతాయి. ఆ వ్యక్తి మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు పొరపాటున పంపినట్టు నమ్మబలుకుతాడు. ఆ డబ్బును తిరిగి క్యాష్ రూపంలో ఇవ్వమని అడుగుతాడు. చాలామంది నిజంగానే ఖాతాలో డబ్బులు ఉండటంతో అది నిజమేనని నమ్మి మోసపోతుంటారు. Read Also : Aadhaar Cards : ఆధార్‌పై సంచలనం.. అక్కడ 18 ఏళ్లు దాటితే ఇచ్చేది లేదు..! అసలు రిస్క్ ఏంటి? : ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాడ్ మనీని సైబర్ మోసగాళ్లు తమ డబ్బులను విత్ డ్రా చేసేందుకు ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తుంటారు. ఇలా మీ ఖాతాలోకి మీకు తెలియకుండా ఏమైనా డబ్బులు జమ అయితే చట్టపరంగా కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ డబ్బుతో మీకు సంబంధం
లేకున్నా వివరణ ఇవ్వకతప్పదు. మీ ప్రమేయం లేదని అధికారులు నిర్ధారణకు వచ్చేవరకు మీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేస్తారు. ఒకవేళ, మీ బ్యాంకు ఖాతాలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్టు తేలితే బ్యాంకులు ముందుజాగ్రత్త చర్యగా ఆ లావాదేవీతో పాటు అకౌంట్ ఫ్రిజ్ చేస్తాయి. తద్వారా మీరు ఆ ఖాతా నుంచి పేమెంట్లు లేదా క్యాష్ విత్ డ్రా వంటివి ఏది చేయలేరు. అంతేకాదు.. బ్యాంకు అధికారులకు కూడా జరిగిన లావాదేవీకి సంబంధించి వివరణలు ఇవ్వాల్సి వస్తుంది. ఎలా సేఫ్‌గా ఉండాలి? : మీరు ఆన్లైన్లో లేదా క్యాష్ రూపంలో తెలియని వ్యక్తుల నుంచి మనీ రిక్వెస్ట్ పొందడం లేదా ఎక్స్ఛేంజ్ చేయకూడదు. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడమే కాదు.. ఫ్రాడ్ మనీ మీ ఖాతాలో కి వస్తే ఖాతాను బ్యాంకులు నిలిపివేస్తాయి. అందుకే ఇలాంటి యూపీఐ అలర్టులను రెగ్యులర్ చెక్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు బ్రాంచ్ కు ఫిర్యాదు చేయండి. అలాగే 1930కు కాల్ చేసి సైబర్ హెల్ప్‌లైన్‌కు జరిగిన మోసాన్ని రిపోర్టు చేయండి.