
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీసింది. మీనాక్షిపై ఒక కేసు ఉన్నట్టు తెలంగాణ కాంగ్రెస్ నేతే లీక్ ఇచ్చాడని బీజేపీ నేత ఒకరు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం అత్యంత సీరియస్గా తీసుకున్నట్లు వెల్లడించారు. నామినేషన్ తిరస్కరణకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఎక్కడ పొరపాటు జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు అనే విషయాలపై ఇప్పటికే అంతర్గత విచారణ ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, ఎక్కడ లోపం జరిగిందో, ఎవరి పాత్ర ఉందో సమగ్రంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్లో ఉండి ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూర్చే కోవర్ట్లను త్వరలోనే గుర్తిస్తామని మహేశ్ గౌడ్ హెచ్చరించారు. “లీక్ వీరులు ఎవరో, గ్రీక్ వీరులు ఎవరో త్వరలో అందరికీ తెలుస్తుంది” అని అన్నారు. నామినేషన్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది. అంతర్గత విచారణ వేగం పుంజుకోవడంతో లీకుల వెనుక ఉన్న అసలు వ్యక్తులు త్వరలోనే బయటపడే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి
.