
కాకినాడ జిల్లా, తుని మండలం సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీని వీలైనంత వేగంగా కనుగొనాలని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన శనివారం కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి, గాలింపు చర్యల పురోగతిని సమీక్షించారు.
వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, దర్యాప్తును మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంపై ఆయన పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.ప్రస్తుతం పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్వహిస్తున్న గాలింపు చర్యలకు అదనంగా మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ముఖ్యంగా, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సేవలను కూడా వినియోగించుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాలిక ఇంటి పరిసరాల్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నందున, ఆ ప్రాంతంలో విస్తృతంగా జల్లెడ పట్టాలని తెలిపారు.
అడవుల్లో తిరగడంలో నైపుణ్యం ఉన్న నిపుణులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నైట్ వాచర్లు, బేస్ క్యాంప్ వాచర్ల సహాయం తీసుకోవడం ద్వారా గాలింపును మరింత ప్రభావవంతంగా మార్చాలని సలహా ఇచ్చారు.ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ చేపడుతున్న చర్యలను డిప్యూటీ సీఎంకు వివరించారు. బాలిక ఆచూకీ కోసం ఇప్పటికే 400 మందికి పైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
అత్యాధునిక డ్రోన్ల సహాయంతో అణువణువూ గాలిస్తున్నామని, బాలిక ఇంటి చుట్టుపక్కల ఉన్న 38 సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించామని ఆయన పవన్ కల్యాణ్‌కు తెలియజేశారు
.