
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ఎంతలా అభివృద్ధి చెందుతోందో తెలిసిందే. దానిని అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు ప్రమాదకరమైన మోసాలకు తెరలేపుతున్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ల ‘డీప్‌ఫేక్’ వీడియో కాల్స్‌ను సృష్టించి విశాఖపట్నానికి చెందిన ఒక సామాన్య వ్యక్తిని రూ. 80 వేలకు ముంచేసిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సాంకేతికతను వాడుకుని కేటుగాళ్లు ఎంత పక్కాగా స్కెచ్ వేశారో ఈ వివరాలు చూస్తే అర్థమవుతుంది. విశాఖపట్నం సీతంపేటకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి ఒక భూమి సమస్య ఉంది. దానిని పరిష్కరించాలంటూ ఆయన మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీనిని గమనించిన సైబర్ దొంగలు మరుసటి రోజే వాట్సాప్ ద్వారా శ్రీనివాస్ రెడ్డిని కాంటాక్ట్ చేశారు. నమ్మకం కుదర్చడం కోసం మాజీ మంత్రి దేవినేని ఉమా ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్నారు. మీ సమస్య సీఎంఓ దాకా వెళ్లిందని, త్వరలోనే పరిష్కారమవుతుందని నమ్మబలికారు. బాధితుడికి ఇంకాస్త గట్టి నమ్మకం కలిగించడం కోసం నేరగాళ్లు ఏఐ (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి ఒక వీడియో కాల్ చేశారు. ఆ కాల్లో సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూర్చుని, తన సమస్యను పరిష్కరిస్తామని స్వయంగా హామీ ఇస్తున్నట్లు ఆ వీడియోను మార్ఫింగ్ చేశారు. ఆ వీడియో కాల్ చూసిన శ్రీనివాస్ రెడ్డి... నిజంగానే ముఖ్యమంత్రే తనతో మాట్లాడుతున్నారని నమ్మి మైమరచిపోయారు. ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టిన కేటుగాళ్లు.. ఈ ల్యాండ్ ఇష్యూ కాస్త కాంప్లికేటెడ్‌గా ఉందని, దీనిని సెటిల్ చేయాలంటే కొంత ఖర్చవుతుందని నమ్మబలికారు. బాధితుడి నుంచి విడతల వారీగా దాదాపు 80 వేల రూపాయలను ఆన్లైన్ ద్వారా గుంజేశారు. డబ్బులు పంపిన తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో, తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్ రెడ్డి సైబర్ క్రైమ్
పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేసి ఈ హైటెక్ మోసంపై దర్యాప్తు ప్రారంభించారు. టెక్నాలజీ పెరిగేకొద్దీ నేరాల శైలి కూడా ఎలా మారుతోందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత సమస్యలను, ఫోన్ నంబర్లను పెట్టేటప్పుడు.. అలాగే గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది.