
114 Rule | ఇంటర్నెట్ డెస్క్: డబ్బు ఎంత సంపాదిస్తున్నామో కాదు, ఎంత ఆదా చేస్తున్నామన్నదే ముఖ్యం. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రిటైర్మెంట్ వంటి భవిష్యత్ అవసరాల కోసం డబ్బులు కూడబెడతాం. ఇందుకోసం
బ్యాంకులు, పోస్టాఫీస్, స్టాక్ మార్కెట్, మ్యూచ్‌వల్ ఫండ్స్ వంటి ఎన్నో మార్గాలను ఎంచుకుంటాం. మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే సరైన ప్రణాళిక అవసరం. మనం చేసే లక్ష రూపాయల పొదుపు రూ.2 లక్షలు, రూ.3 లక్షలుగా మారడానికి ఎంత కాలం పడుతుందో ముందే అంచనా వేసుకోవాలి. ఇందుకోసం ఓ రూల్ ఉంది. అదే 114. దీనిద్వారా ఎన్నేళ్లలో మూడింతలు అవుతుందో ముందే ఓ అంచనాకు రావొచ్చు.
మీ డబ్బు మూడింతలు కావడానికి ఎంతకాలం పడుతుందో 114 థంబ్ రూల్ చెప్తుంది. పొదుపుపై వచ్చే వార్షిక వడ్డీని 114తో భాగిస్తే ఎన్నేళ్లకు డబ్బు ట్రిపుల్ అవుతుందో ఇట్టే చెప్పేస్తుంది. ఉదాహరణకు 6 శాతం వార్షిక వడ్డీకి లక్ష రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం. అప్పుడు 114ను 6తో (114/6) భాగిస్తే 19 వస్తుంది. అంటే రూ.లక్ష పొదుపు చేసినట్లయితే మూడింతలు అయ్యేందుకు 19 ఏళ్ల సమయం పడుతుందన్నమాట. వార్షిక వడ్డీ 8 శాతం ఉందనుకుంటే 114/8 చేస్తే 14.25 వస్తుంది. అంటే మీ సొమ్ము మూడింతలు అయ్యేందుకు 14 ఏళ్ల సమయం తీసుకుంటుంది. అదే వార్షిక వడ్డీ 10 శాతం ఉంటే 11.4 ఏళ్లు, వార్షిక వడ్డీ 12 శాతం ఉంటే 9.5 ఏళ్ల సమయం పడుతుందన్నమాట. ఇది పూర్తిగా వడ్డీ ప్రతిపాదికనే ఆధారపడి ఉంటుంది.
థంబ్ రూల్ 114 లానే థంబ్ రూల్ 72 ఉంది. డబ్బు రెట్టింపు కావడానికి ఎంతకాలం పడుతుందో థంబ్ రూల్ 72 చెబుతుంది. పొదుపుపై వచ్చే వార్షిక వడ్డీని 72తో భాగిస్తే ఎన్నేళ్లకు పొదుపు డబ్బు రెండింతలు అవుతుందో తెలుస్తుంది. ఉదాహరణకు లక్ష రూపాయలు పొదుపు చేస్తే దానిపై వార్షిక వడ్డీ 6 శాతం ఉందనుకుందాం. అప్పుడు 72ను 6తో (72/6) భాగిస్తే 12 అవుతుంది. అంటే లక్ష రూపాయలు రెట్టింపవడానికి 12 ఏళ్ల కాలం పడుతుంది. వార్షిక వడ్డీ 8 శాతం ఉంటే 9 ఏళ్లు, వార్షిక వడ్డీ 10 శాతం ఉంటే 7.2 ఏళ్లు, వడ్డీ 12 శాతం ఉంటే 6 ఏళ్ల సమయం పడుతుందన్నమాట. ఈ థంబ్ రూల్స్ ఆధారంగా మీ పొదుపు ఎన్నేళ్లకు డబుల్, ట్రిపుల్ అవుతుందో ఓ అంచనా వేసుకోండి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.