
ఇంటర్నెట్ డెస్క్: దేశ రక్షణలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. శత్రుదేశాల నుంచి ఎదురయ్యే విభిన్న ముప్పులను ఎదుర్కొనేలా మన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంది. బాలిస్టిక్ మిసైల్
డిఫెన్స్, యాంటీ షిప్ వార్ఫేర్లో కొత్త టెక్నాలజీని డీఆర్డీవో (DRDO) విజయవంతంగా పరీక్షించింది. దీంతో దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల దాడులను తిప్పికొట్టే సామర్థ్యం భారత్‌కు లభించినట్లయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఎక్స్‌లో వెల్లడిస్తూ.. ప్రయోగానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.
దీర్ఘశ్రేణి ఖండాంతర క్షిపణుల ఆట కట్టించే మల్టీలేయర్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (Multi-layered BMD) వ్యవస్థను డీఆర్డీవో ఇటీవల విజయంతంగా పరీక్షించింది. జూన్ 10, 11 తేదీల్లో వరుసగా మూడు ఫ్లైట్ టెస్ట్‌లు నిర్వహించింది. ఇందులో ఇంటర్సెప్టర్లు విజయవంతంగా తమ లక్ష్యాలను ఛేదించి.. బీఎండీ సామర్థ్యాన్ని నిరూపించాయి. ఖండాంతర క్షిపణి ముప్పును ఎదుర్కొనేలా అధునాతన సాంకేతికతతో ఈ డిఫెన్స్ వ్యవస్థను డీఆర్డీవో రూపొందించింది.
దీంతో బీఎండీ సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో భారత్ చేరినట్లయ్యిందని డీఆర్డీవో వెల్లడించింది. ఇక నావెల్ యాంటీ-షిప్ మిసైల్ మీడియం రేంజ్ (NASM-MR) తొలి పరీక్షను కూడా శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీవోను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.