హైదరాబాద్ శివార్లలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల తయారీ కేంద్రాన్ని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం పరిసరాల్లో
తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, ఎల్బీనగర్ జోన్ క్లూస్ టీం సంయుక్తంగా ఈ మెరుపుదాడి నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో దశాబ్దానికి పైగా దేశవ్యాప్తంగా నేర చరిత్ర కలిగిన ఒక అంతర్జాతీయ డ్రగ్స్ కింగ్పిన్తో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.50 లక్షల విలువైన 750 గ్రాముల స్వచ్ఛమైన మెఫెడ్రోన్ మాదకద్రవ్యాన్ని, దాన్ని తయారు చేయడానికి ఉపయోగించే నిషేధిత రసాయనాలను, ల్యాబ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈగల్ ఫోర్స్ పోలీసులు వెల్లడించిన సంచలన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కీసరి మత్స్యగిరి అలియాస్ నరేష్ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలో కీలక సూత్రధారి. ఇతడు ముఠాలోని ఇతర కీలక సభ్యులైన సంతోష్‌సింగ్ అలియాస్ రాజు, విజయ్, అశ్వినీ పాఠక్‌లతో కలిసి 2015 నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రహస్యంగా మాదకద్రవ్యాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేశాడు. గతంలో పలుమార్లు వివిధ రాష్ట్రాల పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లినప్పటికీ బయటకు వచ్చి మళ్లీ అదే దందా మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కు చెందిన రావుల మహేష్ అనే వ్యక్తిని సంప్రదించి ఫేషియల్ గ్లో పౌడర్ తయారు చేస్తున్నామంటూ నమ్మబలికాడు. అక్కడ ఒక మామిడి తోటలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మహేష్‌కు నెలకు రూ.10 వేల జీతం ఇస్తానని ఆశచూపి లోబరుచుకున్నాడు.ఆ తర్వాత ప్రభాకర్ అనే మరో ముఠా సభ్యుడి నుంచి డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు, యాసిడ్లు, గ్లాస్ బీకర్ల వంటి రసాయన పరికరాలను రూ.60 వేలకు కొనుగోలు చేశాడు. వాటిని మహేష్ కాపలా ఉంటున్న మామిడి తోటలోని ఒక నిర్మానుష్య షెడ్డుకు తరలించి రాత్రి వేళల్లో రహస్యంగా ల్యాబ్ నడిపాడు. అక్కడ రసాయన ప్రక్రియల ద్వారా మొదట రెండు కిలోల ముడి మెఫెడ్రోన్‌ను సిద్ధం చేసి దాని నుంచి కెమికల్ ఫిల్ట్రేషన్ ద్వారా 750 గ్రాముల నాణ్యమైన మెఫెడ్రోన్‌ను శుద్ధి చేశాడు. ఈ మత్తు పదార్థాన్ని గురువారం రాత్రి సూర్యాపేటకు తరలించి అక్కడ ఉన్న ఏజెంట్లకు భారీ ధరలకు విక్రయించేందుకు కీసరి మత్స్యగిరి, మోత్కూర్‌కు చెందిన నిమ్మల నరేష్‌తో కలిసి స్కెచ్ వేశాడు.వీరిద్దరూ కలిసి బాటసింగారంలోని శ్రీసాయి హెచ్ఎండీఏ వేబ్రిడ్జి కార్యాలయం సమీపంలో డ్రగ్స్ డెలివరీ కోసం వేచి ఉండగా.. పక్కా సమాచారంతో నిఘా ఉంచిన ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ బృందాలు వీరిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం నిందితులు ఇచ్చిన సమాచారంతో మామిడి తోటలోని తయారీ కేంద్రంపై దాడి చేసి పరికరాలు, రసాయనాలు, ఒక కారు, మూడు సెల్ఫోన్లను సీజ్ చేశారు. యువతను మత్తు కూపంలోకి నెడుతున్న ఈ ముఠాలోని మిగిలిన కీలక నిందితులు విజయ్, సంతోష్, ప్రభాకర్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.