
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Food Adulteration Tirupati: మస్త్ మస్త్ మటన్ బిర్యానీ, ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ అని హోటళ్లకు వెళ్లి లొట్టలేసుకుని తింటున్నారా? బోటీ భలేగా ఉంది.. పాయ అద్దిరిపోయిందంటూ తెగ జుర్రేస్తున్నారా? అయితే నాన్-వెజ్ ప్రియులారా.. ఒక్క నిమిషం ఆగండి! మీరు తింటున్నది తాజా మాంసం కాకపోవచ్చు, అది మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కాలకూట విషం కూడా కావచ్చు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వెలుగుచూసిన కల్తీ మాంసం దందా వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
డబ్బే పరమావధిగా భావిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీగాళ్లు టన్నుల కొద్దీ కుళ్లిపోయిన మాంసాన్ని దర్జాగా హోటళ్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదులపై తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో అధికారులు.. నగరంలోని పెద్ద పీర్ల చావడి ప్రాంతంలో ఉన్న మటన్ మార్కెట్‌పై శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని చూసి అధికారులు సైతం ఒక్కసారిగా విస్తుపోయారు.
వెలుగుచూసిన షాకింగ్ నిజాలు.. పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ ధరకే తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల తలలు, కాళ్లు, బోటీలను ఎన్నో రోజులుగా ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చూపించడానికి కూడా వీల్లేనంతగా కుళ్లిపోయిన ఆ మాంసం నుండి కిలోమీటర్ల మేర కంపు కొడుతోంది. కొన్ని దుకాణాల్లో ఫ్రీజర్లలో గడ్డకట్టుకుపోయిన కుళ్లిన మాంసాన్ని బయటకు తీయడానికి తుప్పుపట్టిన ఇనుప చువ్వలను వాడారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
15 దుకాణాలు సీజ్..! ఈ ఆకస్మిక దాడుల్లో భాగంగా మొత్తం 15 దుకాణాల్లో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దాదాపు 1,000 కిలోలకు పైగా (ఒక టన్ను) కల్తీ మటన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రజారోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తూ, కల్తీ దందాకు పాల్పడుతున్న సదరు మటన్ షాపుల యజమానులపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేస్తున్నా కల్తీగాళ్లలో మార్పు రావడం లేదు. అందుకే బయట నాన్-వెజ్ తినేటప్పుడు, కొనేటప్పుడు వినియోగదారులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.