
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో తనకు వ్యక్తిగత పంచాయితీ లేదని.. ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానం తనతో సహా చాలా మందికి నచ్చడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)
అన్నారు. మున్సిపల్ శాఖ సీఎం పరిధిలో ఉందని.. హైదరాబాద్‌లో వర్షం పడి ప్రజలకు ఇబ్బంది ఎదురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. గతంలో 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. నగరాన్ని అద్దంలా మాకు అప్పగిస్తే.. మేం చెడగొట్టామా? అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు.
‘‘బీఆర్ఎస్ (BRS) హయాంలో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) చేపట్టి మెరుగు చేస్తే.. రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేశారు. నీళ్లు నిలవకపోతే క్రెడిట్ తీసుకుంటారు.. నిలిస్తే బీఆర్ఎస్ది బాధ్యత అంటారా? ఉన్న నగరంపై సీఎంకు అవగాహన లేదు కానీ.. ఫ్యూచర్ సిటీ అని ప్రగల్బాలు పలుకుతున్నారు. రేవంత్ సీఎం కాగానే ఎయిర్‌పోర్టుకు మెట్రోను రద్దు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే పూర్తయ్యేది. ఆ మెట్రో లైన్ పూర్తయి ఉంటే సమస్య ఇంత ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను లాక్కోవడం తప్ప చేసిందేంటి? హైడ్రానే అన్నీ చేస్తోందని చెప్పి అధికారాలు ఇచ్చి బ్లాక్‌మెయిలింగ్ వ్యవస్థలా చేశారు.
కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది.. ఎప్పుడనేది తర్వాత తెలుస్తుంది. SIR, సభ్యత్వ నమోదుపై దాదాపు 60 నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తయ్యాయి. 15 రోజుల్లో అవి పూర్తవుతాయి. త్వరలో అన్ని నియోజకవర్గాల వారీగా శిక్షణ ఉంటుంది. వచ్చే నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో ఉంటుంది. బీఆర్ఎస్కు భాజపాతోనే పోటీ. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు.. భవిష్యత్‌లోనూ ఉండవు. కాంగ్రెస్, భాజపాకు అంత రీచ్, క్యాడర్ లేదు. బీఆర్ఎస్కు బలమైన నాయకత్వం, క్యాడర్ ఉంది. కాంగ్రెస్ జారుడుబండపై ఉంది.. కిందికే తప్ప పైకి వెళ్లలేరు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం సరికాదు. ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచే సమాచారం వచ్చిందని మహారాష్ట్ర మంత్రి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో బ్లాక్ షీప్ ఎవరో రాహుల్ గాంధీ తేల్చాలి’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
వచ్చే నెలలో కేంద్రం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందనే సమాచారం తమకుందని కేటీఆర్ అన్నారు. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్నారు. ‘‘జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. డీలిమిటేషన్లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకోం’’ అని కేటీఆర్ అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అనుకోని ప్రమాదం.. అయిపోయిందనుకన్న జీవితం.. ఆత్మహత్యకూ పాల్పడిన దైన్యం.. కానీ, అక్కడితో ఆగిపోలేదు ఈ కథ.