
లాస్ ఏంజెలెస్: జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలో మూవీ చేయాలన్న ఆసక్తితో రెండుసార్లు ప్రయత్నించినా తనకు తిరస్కరణే ఎదురైందని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) అన్నారు. ఇటీవల
ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. ‘007’ (James Bond 007) చిత్రానికి దర్శకత్వం వహించకపోవడం వల్ల ఏమైనా బాధ ఉందా? అని విలేకరి ప్రశ్నించగా.. దానికి స్పీల్బర్గ్ సమాధానం ఇచ్చారు.
‘‘అవును! బాండ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం నాకు ఇవ్వకపోవడం బాధ కలిగించింది. ‘జాస్’ (Jaws) విజయం సాధించిన తర్వాత బాండ్ ఫ్రాంఛైజీ మూవీ నిర్మాత కబ్బీ బ్రోకలీతో మాట్లాడాను. ‘డాక్టర్ నో’ (Dr.No) సినిమా చూసినప్పటి నుంచే బాండ్ మూవీకి పనిచేయాలన్న నా ఆసక్తిని ఆయనకు తెలియజేశా. కానీ, ఎందుకో ఆయన నా దర్శకత్వం పట్ల ఆసక్తి చూపలేదు. అందుకు తగిన కారణం కూడా చెప్పలేదు. ఆ తర్వాత ‘క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ (Close Encounters of the Third Kind) విడుదలయ్యాక నేను మరోసారి నా ఆసక్తిని ఆయన ముందు వ్యక్తపరిచాను’’
‘‘అదే సమయంలో ‘మూన్‌రేకర్’ (Moonraker) చిత్రంలోని ఒక సన్నివేశం కోసం నా మూవీలోని ఐదు ఆడియో క్లిప్‌లను ఉపయోగించుకుంటానంటూ బ్రోకలీ నా అనుమతి కోరారు. తర్వాతి బాండ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశమిస్తే, ఆ ఐదు ఆడియో క్లిప్‌లను వినియోగించుకునే అనుమతి ఇస్తానన్నాను. కానీ, ఆయన అంగీకరించలేదు. అయినప్పటికీ, నేను ఆ ఐదు ఆడియోలు ఇచ్చేశాను’’ అని స్పీల్బర్గ్ గుర్తుచేసుకున్నారు. అయితే, ఆ అవకాశం చేజారిపోవడం ‘ఇండియానా జోన్స్’ వంటి యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంఛైజీ చేయడానికి బాటలు పడ్డాయి. ఆ సిరీస్‌లో స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి.
ఇప్పుడు బాండ్ సినిమా చేస్తారా? అని అడగ్గా.. ‘వాళ్లకు నన్ను భరించే సామర్థ్యం లేదు’ అని స్పీల్బర్గ్ నవ్వుతూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ అమెజాన్ MGM స్టూడియోస్ చేతిలో ఉంది. డ్యూన్ దర్శకుడు డెనిస్ విల్లెన్యువ్ (Denis Villeneuve) బాండ్ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. డేనియల్ క్రెగ్ (Daniel Craig) తర్వాత బాండ్ పాత్రను పోషించే నటుడి కోసం వెతుకుతున్నారు. అయితే, ఈ సారి బాండ్ పాత్రలో హీరోయిన్ నటిస్తారని హాలీవుడ్ టాక్. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక స్పీల్బర్గ్ తాజా చిత్రం ‘డిస్క్లోజర్ డే’ (Disclosure Day) విడుదలకు సిద్ధమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ (SlumDog - 33 Temple Road).