
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ
మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియో విడుదల చేశారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచన విరమించుకుంటానని లారెన్స్ (Raghava Lawrence) పేర్కొన్నారు.
లారెన్స్ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో ఆయన పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై లారెన్స్ ఈ ఉదయం ఓ పోస్ట్ చేశారు. ‘‘ఫలితం ఆశించకుండా నిజాయతీగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. రాజకీయాల్లోకి రావాలని నేను ఏనాడూ అనుకోలేదు. సీటు కావాలి, డబ్బు సంపాదించాలనే ఆలోచన లేదు. నాకు అత్యంత సన్నిహితులెవరైనా రాజకీయాల్లోకి చేరితే వారి పక్కన నిలబడి సమాజానికి ఇప్పుడు చేస్తున్న దానికంటే మరింత ఎక్కువ సేవ చేయాలనుకున్నా. కానీ, కొన్ని పరిస్థితులు, సంఘటనలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కలిగించాయి’’ అని ఆయన రాసుకొచ్చారు.
కాసేపటికే లారెన్స్ ఓ వీడియో విడుదల చేశారు. తాను రాజకీయాల్లోకి వెళ్తానని చెబితే తన తల్లి అంగీకరించారని అందులో తెలిపారు. తన జీవిత ప్రయాణంలో ఎదురైన కొన్ని సంఘటనలను పంచుకుని.. వాటి నుంచే రాజకీయాలపై స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. ‘‘నా నిర్ణయం సరైందో కాదో చెప్పాలని మిమ్మల్ని (ప్రజలను) కోరుతున్నా. మీరు అంగీకరిస్తే మీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వస్తా. ఎప్పుడు ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తానో.. ఏ పార్టీలో చేరుతానో సమయం చూసుకుని ప్రకటిస్తా. మీరు వద్దంటే ఈ ఆలోచన మానుకుని.. ఎప్పటిలాగే సమాజం కోసం నిస్వార్థంగా నా సేవలను కొనసాగిస్తా’’ అని లారెన్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత, సీఎం విజయ్ (Vijay) రెండు స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితాల అనంతరం పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన విజయ్.. తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే లారెన్స్ అక్కడి నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన టీవీకేలో చేరుతారనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. విజయ్‌తో లారెన్స్‌కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.