
ఇంటర్నెట్‌డెస్క్: వెండితెరపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) యాక్షన్‌తో ఎంత మెప్పిస్తారో, కామెడీతోనూ అంతే నవ్వులు పంచుతారు. ఇక వేదికలపై ఆయనలో కనిపించే జోష్ గురించి ప్రత్యేకంగా
చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’ (Welcome To The Jungle) . చాలా ఏళ్ల తర్వాత నటి రవీనా టాండన్‌తో (Raveena Tandon) కలిసి అక్షయ్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ పాపులర్ ఆన్ స్క్రీన్ జోడీని మళ్లీ తెరపై చూడడానికి అభిమానులు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 26న (welcome to the jungle release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం చిత్ర ట్రైలర్ విడుదలైంది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ రవీనా టాండన్ వృత్తిపరమైన నిబద్ధతను ప్రశంసిస్తూ, వారి కెరీర్ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ‘‘వృత్తిపరంగా ఆమెలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. ఆ మూవీలో ఒక షాట్ తీయడానికి కేవలం 25-30 నిమిషాల సమయం మాత్రమే ఉంది. దుస్తులు మార్చుకొనే గది చాలా దూరంగా ఉంది. అంత తక్కువ సమయంలో రవీనా అక్కడకు వెళ్లి, దుస్తులు మార్చుకోవడం అసాధ్యమనిపించింది. కానీ, ఆమె సింపుల్‌గా జనరేటర్ వ్యాన్‌లోకి వెళ్లి, అక్కడే దుస్తులు మార్చుకుని షాట్‌కి వచ్చారు. పనిపట్ల ఆమెకున్న నిబద్ధత అలాంటిది’’
‘‘ఆమె ఒక అద్భుతమైన నటి. గతంలో హీరోయిన్గా ఉండేది. కానీ, ఇప్పుడు హీరోయిన్ తల్లి పాత్రలో కనిపిస్తోంది. ఇది అతిపెద్ద మార్పు’ అంటూ చివరిలో పంచ్ వేసి నవ్వులు పంచారు. ఈ కార్యక్రమానికి రవీనా హాజరుకాలేదు. సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ, దిశా పటాని, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లారా దత్తా, జాకీ ష్రాఫ్, పరేష్ రావల్, జానీ లివర్, రాజ్‌పాల్ యాదవ్, కృష్ణ అభిషేక్, కికు షర్దా, దలేర్ మెహందీ ఈ సినిమాలో నటిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.