
న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ పోస్ట్ చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం కేన్
విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ పోస్ట్ చేశాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు కివీస్ జట్టుకు సేవలందించిన ఈ స్టార్ బ్యాటర్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆకస్మికంగా ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. 35 ఏళ్ల విలియమ్సన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కూడా అతడు ఇకపై కనిపించే అవకాశం లేదు. మిగిలిన మ్యాచ్‌ల కోసం అతడి స్థానంలో కివీస్ మేనేజ్మెంట్ కొత్త ఆటగాడిని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
రిటైర్మెంట్ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో విలియమ్సన్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఈ నిర్ణయం గురించి కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. అయితే ఇదే సరైన సమయమని నాకు అనిపించింది. న్యూజిలాండ్ తరఫున ఆడటం నాకెప్పుడూ గర్వకారణం. ప్రతి మ్యాచ్‌లో నా శక్తి మేరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నించాను. అంతకంటే తక్కువ స్థాయిలో కొనసాగడం సరికాదని అనిపించింది. అయితే నా రిటైర్మెంట్ నిర్ణయం నేనే తీసుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే న్యూజిలాండ్ జట్టు భవిష్యత్తుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ జట్టులో అపారమైన ప్రతిభ ఉంది. గొప్ప విజయాలు సాధించాలనే తపన కూడా కనిపిస్తోంది. ఈ జట్టుతో నా అనుబంధం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. ఇన్నేళ్లు ఈ ప్రయాణంలో భాగం కావడం నా అదృష్టం’ అని విలియమ్సన్ వెల్లడించాడు.
2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్.. తన కెరీర్లో 378 మ్యాచ్‌లు ఆడి 19,346 పరుగులు సాధించాడు. 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలతో న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆధునిక క్రికెట్లో విలియమ్సన్ 'ఫ్యాబ్ ఫోర్'గా పేరుపొందిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్‌లలో అన్ని అంతర్జాతీయ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన తొలి ఆటగాడిగా నిలిచాడు. కెప్టెన్‌గా కూడా విలియమ్సన్ న్యూజిలాండ్‌కు మరపురాని విజయాలు అందించాడు. 2021లో భారత జట్టును ఓడించి తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) టైటిల్‌ను కివీస్‌కు అందించాడు. అలాగే రెండు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్, మూడు సెమీ ఫైనల్స్‌కు జట్టును నడిపించాడు.
అయితే క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యే ఆలోచన మాత్రం విలియమ్సన్కు లేదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో అతడు కొనసాగనున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తన అనుబంధాన్ని మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వ్యూహాత్మక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతడు.. భవిష్యత్తులో ఫ్రాంచైజీ నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
ప్రశాంత స్వభావం, నిలకడైన బ్యాటింగ్, అద్భుతమైన నాయకత్వంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విలియమ్సన్.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. అతడి రిటైర్మెంట్తో అంతర్జాతీయ క్రికెట్లో ఒక స్వర్ణయుగానికి తెరపడిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేట్ జెట్‌లో క్రికెట్ ఆడిన సచిన్.. వీడియో వైరల్