
భారతీరాజా అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖ హాస్యనటుడు వడివేలు రద్దీ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దిగ్గజ దర్శకుడు భారతీరాజా (bharathiraja) బుధవారం
చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కుటుంబీకులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల నడుమ గురువారం ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. దిండిగల్ జిల్లా కొడైకెనాల్ రోడ్డు వత్తలగుండులోని ఫామ్ హౌస్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. అయితే తమ అభిమాన దర్శకుడిని కడసారి చూసేందుకు సినీ సెలబ్రిటీలతో అభిమానులు సైతం భారీగా తరలి వచ్చారు. అయితే.. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన ప్రముఖ కమెడియన్ వడివేలు అస్వస్థతకు గురి కావడం అక్కడికి వచ్చిన వారిని కలవర పెట్టింది.
భారతీరాజా పార్థివదేహం ఉన్న ఫ్రీజర్ బాక్స్ ఉంచిన ప్రదేశం చిన్నది కావడం, అభిమానులు భారీగా రావడంతో రద్దీ ఏర్పడింది. దీంతో హాస్య నటుడు వడివేలు (Vadivelu) ఊపిరాడక ఇబ్బంది పడడంతో ఆయన్ని బయటకు తరలించారు. ఆయన రోడ్డు పక్కనే ఉన్న హోటల్ ముందు కూర్చొండిపోగా, అక్కడ కూడా అభిమానులు, స్థానికులు గుమికూడారు. వారిని పోలీసులు పక్కకు పంపించారు. ఆ హోటల్ వద్ద కొంతసేపు విశ్రాంతి తీసుకున్న వడివేలు.. ఆ తర్వాత మళ్ళీ అంత్యక్రియల్లో పాల్గొని కారులో ఇంటికి వెళ్లిపోయారు.